ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
క‘న్నీటి’ కష్టాలు తీరాయి
మాది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం. వజ్రపుకొత్తూరు మండలం సీతాపురంలో చిన్నపాటి కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నా. నా భర్త చనిపోయారు. కొడుకు పెళ్లయ్యాక వేరే కాపురం ఉంటున్నాడు. కుమార్తె దివ్యాంగురాలు కావడంతో ఆమెను నేనే సాకుతున్నా. మా ప్రాంతంలో దశబ్దాలుగా కిడ్నీ వ్యాధిబారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. అనేక పరిశోధన సంస్థలు మా ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధికి తాగు నీరు ఒక కారణం అని తేల్చి చెప్పారు. మా గ్రామంలో ఉన్న బావి నీటిని తాగవద్దని అధికారులు చెప్పారు.
అప్పటి నుంచి మంచి నీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మా ప్రాంతంలో ఇంటింటికి రక్షిత మంచి నీటిని కుళాయిల ద్వారా అందించి శాశ్వత పరిష్కారం చూపారు. గతంలో ఏ నాయకుడు మా బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. మా ఇంటికి కుళాయి నీరు వస్తుందని కలలో కుడా ఊహించలేదు. నాకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వచ్చింది. సున్నా వడ్డీ కింద రూ.5,694 వచ్చింది. నాకు, నా కుమార్తె(దివ్యాంగురాలు)కు పెన్షన్ వస్తుండటంతో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఉద్దాన ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– కోటి జయమ్మ, సీతాపురం (కుసుమూరి చలపతిరావు విలేకరి, వజ్రపుకొత్తూరు రూరల్)
ఇంత సాయం ఎన్నడూ ఎరుగం
మాది నిరుపేద కుటుంబం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో నా భర్త అల్లు నరసింహారావు ఆర్‌ఎంపీ వైద్యునిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాకు ఏవిధమైన ఆస్తులు లేవు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సహాయ పడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున అందింది.
జగనన్న ఇళ్ల కాలనీలో ఒకటిన్నర సెంటు స్థలం కూడా మంజూరైంది. మా అమ్మాయి ప్రసవానికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.35 వేల విలువైన చికిత్సను ఉచితంగా చేశారు. మా మనుమలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున సాయం అందిస్తున్నారు. మా లాంటి ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తోడుగా నిలిచారు. మేమంతా ఆయనకు ఎంతో రుణపడి ఉంటాం. – అల్లు మాధవి, మామిడి కుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడి కుదురు)
ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం
నేను ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్ సమీపంలో టీ కొట్టు నడుపుకునేదాన్ని. నా భర్త సామ్యూలు గేదెల మారుబేరం వ్యాపారం చేసేవారు. ఏడాది క్రితం పక్షవాతం రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ సమయంలో ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. జగనన్న ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18750, రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 వంతున వచ్చింది.
ఆ మొత్తంతో టీకొట్టు మానేసి ఇంటి వద్దే చిల్లర కొట్టు పెట్టుకున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించగలుగుతున్నా. నా భర్తకు పక్షవాతం రావడంతో నెలకు రూ.3 వేల వంతున పింఛన్ వస్తోంది. రెండో కొడుకు దివ్యాంగుడు కావడంతో పింఛన్ వస్తోంది. ఇప్పుడు నా కుటుంబం గడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మా కుటుంబానికి అండగా నిలిచిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– గుంటి మార్తమ్మ, బేస్తవారిపేట (పెరుమారెడ్డి హనుమంతారెడ్డి, విలేకరి, బేస్తవారిపేట)
Comments
Please login to add a commentAdd a comment