మృగశిర 3,4 పాదములు (కా, కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (భాగ్యం)లోను తదుపరి మీనం (రాజ్యం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మళ్లీ జూలై 12 నుంచి 2023 జూలై 17 వరకు మకరం (అష్టమం)లోనూ మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (వ్యయం) కేతువు వృశ్చికం (షష్ఠం)లోనూ తదుపరి రాహువు మేషం (లాభం) కేతువు, తుల (పంచమం)లోను సంచరిస్తారు.
2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (వ్యయం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా గ్రహచారం అనుకూలిస్తుంది. గత కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ కాలంలో సమయం వృథా చేయకుండా కృషి చేసేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వృథా కాలక్షేపం చేసేవారికి ఈ గ్రహచారం ఎంతో కొంత జ్ఞానాన్ని అందిస్తుంది.
చతుష్పాద జంతువులు, ఆటోమొబైల్ వ్యాపారములు వృత్తులలో వున్నవారు, కులవృత్తిలో వున్నవారు ఈ సంవత్సరం చాలావరకు సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాలను తెలుసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గతంలో చేసిన పొరపాట్లు గుర్తించి, వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అన్ని కోణాల్లోనూ పురోభివృద్ధి వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆనందంగా ఉంటారు. రోజువారీ పనులు చక్కగా పూర్తవుతాయి. భోజన వస్తు అలంకరణ విషయాలలో చాలావరకు సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అన్ని సందర్భాల్లోనూ కుటుంబసభ్యులు ప్రోత్సాహం ఉంటుంది. భార్యాపుత్రుల విషయంలోను, కుటుంబంలోని పెద్దల అరోగ్య విషయంలోను అనుకూల స్థితి ఉంటుంది. బంధు సహకారం చాలా బాగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారులకు సంవత్సరం అంతా పనివాళ్లతో ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. అధికారుల నుంచి సహకారం బాగా ఉంటుంది. అంతా అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆరోగ్యపరంగా గత సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. అయితే ఎముకలు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి అనుకూలత తక్కువ. ఈ సంవత్సరం కొత్తకొత్త పరిచయాలు పెరుగుతాయి. ధర్మకార్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. గురు అనుగ్రహం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ఇబ్బందులు లేకుండా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. స్నేహితులు, బంధువులు మంచి ప్రోత్సాహం ఇస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అంతా శుభసూచకమే.
విద్యా నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలం. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు గురుబలం, రాహుబలం బాగా అనుకూలించి లాభం పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. మంచి సలహాలు సమయానికి అందుతాయి. గర్భిణిలు ఈ సంవత్సరం ఆగస్టు తరువాత ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.
మృగశిర నక్షత్రం వారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. క్రమంగా కొన్ని సమస్యలు తీరుతున్నట్లుగా గోచరిస్తుంది. కానీ ఆగస్టు నుంచి 2023 జూన్ వరకు బహు జాగ్రత్తలు తీసుకుంటూ వుండవలసిన కాలం. ముఖ్యంగా వ్యవహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు వున్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళేందుకు సిద్ధపడండి. ఆరుద్ర నక్షత్రం వారికి అదృష్టం కలిసి వచ్చేలాగా కాలం గోచరిస్తోంది. అయితే అవరోధం లేకుండా ఏ పనీ పూర్తి అవ్వదు. తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరికలు ఎక్కువ అవుతాయి. భార్యాపిల్లల ఆరోగ్యం, విద్య, వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గత పొరపాట్లు ఇప్పుడు కనువిప్పునిస్తాయి.
పునర్వసు నక్షత్రం వారు అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సంతుష్టిగా భోజనం చేసే విషయంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. తరచుగా పుణ్య కార్యాలు చేస్తుంటారు. చతుష్పాద జంతువుల పెంపకం మీద ఆసక్తి వున్నవారికి, పాడి పరిశ్రమలో వున్నవారికి లాభదాయకంగా వుంటుంది.
శాంతి : శనికి తరచుగా శాంతి చేయించడం. ఆగస్టు తరువాత కుజుడి శాంతి చేయించడం చాలా అవసరం. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ చేయడం ద్వారా తరచుగా శుభాలు జరుగుతాయి.
ఏప్రిల్: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతి పనీ శ్రమతో పూర్తవుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుజగ్రహ శాంతి అవసరం. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు అవసరం.
మే: అంతా శుభసూచకంగా ఉంటుంది. వాక్పటిమతో అన్ని పనులూ సాధిస్తారు. కొన్ని సందర్భాలలో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలు బాగా సహకరిస్తారు. కొత్త ఆలోచనలు ఈ నెలలో అమలులోకి వస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఋణ సౌకర్యం లభిస్తుంది.
జూన్: తెలివితేటలు బాగా ప్రదర్శించి కార్యజయం సాధిస్తారు. అయితే పనులన్నీ శ్రమతో మాత్రమే పూర్తవుతాయి. చివరి వారంలో అనవసర కలహాలు వస్తుంటాయి. తరచుగా ఈ నెలలో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకపోకలు సరదా కాలక్షేపాలతో కాలం గడుపుతారు. వాహన ప్రమాదం జరగకుండా చూసుకోండి.
జూలై: మంచి ధైర్యం ప్రదర్శిస్తారు. మొదటి రెండు వారాలు ప్రయాణాల్లో చికాకులు ఎదురవుతాయి. మొత్తం మీద నెల రోజులు అనుకూల కాలమే. అన్ని పనులూ చివరి రెండు వారాల్లో తేలికగా పూర్తవుతాయి. కుటుంబసభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. స్నేహపూర్వక ధోరణితో పనులు పూర్తి చేసుకుంటారు.
ఆగస్టు: ఇక్కడి నుంచి కుజుడు అధికకాలం యోగించని స్థానంలో సంచరిస్తారు. అయితే మిగిలిన గ్రహచారం అనుకూలత దృష్ట్యా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఆరోగ్య ఋణ వ్యవహారాలు సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్తలు పడాలి. రానున్న ఆరునెలలు వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి.
సెప్టెంబర్: గతం కంటే కొంత మంచి మార్పులు ఈ నెలలో ద్వితీయార్ధంలో ఉంటాయి. అనవసర వ్యవహారాలను ముందుగా గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. నూతన వ్యవహారాలకు సానుకూలం కాదు.
అక్టోబర్: బుధ శుక్రులు అనుకూలం అయినా, కుజ శని సంచారం వలన ఈ నెలలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా స్నేహితులతో కలిసి ఏ వ్యవహారాలూ చేయకండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అవకాశం చూసుకొని ఋణ విషయాల్లో సెటిల్‌మెంట్ ధోరణిని అవలంబించండి.
నవంబర్: కొద్దిరోజులు అనుకూలంగా కొద్ది రోజులు ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి. తరచుగా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు. మీ ఉద్యోగ విధి నిర్వహణలో అధికారుల ఒత్తిడి పెరిగి క్రమంగా చివర్లో లాభిస్తుంది. పుణ్యకార్యాలపై దృష్టిపెడతారు.
డిసెంబర్: ఉద్యోగ విషయంలో ఎవరిమీదా ఆధారపడవద్దు. వ్యాపారస్తులు ధైర్యంగా ఉంటారు. కానీ సంతృప్తికరంగా వ్యాపారం చేసే అవకాశం లేదు. తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనం సర్దుబాటు కావడం కష్టమే. భోజనం వంటి రోజువారీ కార్యక్రమాలు సరిగా నడవక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జనవరి: ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించవలసిన కాలం. ఎవరి మీదా ఆధారపడకూడని కాలం. మీ వ్యవహారాలు మిత్ర భేదానికి, బంధు వైరానికి తావివ్వకుండా చూసుకోండి. చివరి వారంలో కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. వృత్తి సౌఖ్యం తక్కువ అనే చెప్పాలి.
ఫిబ్రవరి: ప్రధానంగా కుజ, రవి సంచారం ఫలితంగా 15వ తేదీలోగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో చికాకులు అధికంగా ఉంటాయి. తరువాత సాధారణ స్థాయిలో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక వనరులు బాగానే సమకూరతాయి. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త అవసరం.
మార్చి: ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రయాణాలు చేయండి. ప్రత్యేక ఇబ్బందులు ఉండవుగాని, జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. రోజువారీ కార్యక్రమాలు సైతం అకాలంలో పూర్తవుతాయి. వృత్తి విషయాలలో అందరితోనూ స్నేహంగా ఉండటం అలవరచుకోవాలి.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment