చిత్త 3,4 పాదములు (రా, రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)
గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (పంచమం)లోనూ తదుపరి మీనం (షష్ఠం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (చతుర్థం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (అష్టమం), కేతువు వృశ్చికం (ద్వితీయం)లోను తదుపరి రాహువు మేషం (సప్తమం) కేతువు తుల (జన్మం)లో సంచరిస్తారు.
2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (అష్టమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా గురువు శని కొంతకాలం అనుకూలించడం రాహుకేతువులు సంవత్సరం అంతా అనుకూలింపకపోవడం వల్ల చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎవరినీ నమ్మవద్దు. ఎవరి మీదా ఆధారపడి ఏ పనీ మొదలు పెట్టవద్దు. తరచుగా మోసపూరిత వాతావరణం మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. గురువు కుంభంలో ఉండగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. జూన్ నుంచి కుజుడు ప్రతికూలించడం. గురువు మీనంలో సంచారం చేసేకాలంలో ఆర్థిక వెసులుబాటు సరిగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఋణాలు తీర్చే ప్రయత్నంలో చికాకులు రాగలవు. అవసరానికి కొత్త ఋణాలు అందక ఇబ్బందులు ఎదురవుతాయి.
కుటుంబ సభ్యులు ఎప్పుడు సహకరిస్తారో ఎప్పుడు నిరాకరిస్తారో తెలియని స్థితి. పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందవు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రతలు పాటించడం శ్రేయస్కరం. ప్రమోషన్, స్థానచలనం వంటి అంశాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. చేస్తున్న వ్యాపారం మానేసి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలం కాదు.
వ్యాపారులకు సంవత్సరం అంతా అనవసర ఆలోచనలు కలిగినా, చివరకు లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది. ఆహార విహారాల్లో నియమాలు పాటించక, ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలుకొని తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం అంతా విచిత్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి.
స్థిరాస్తి కొనుగోలులో ఎవరి సలహాలూ తీసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అంత తేలిగా సాగవు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరైన మార్గంలో సాగవు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు మోసం చేసేవారు ఎక్కువసార్లు ఎదురవుతారు. విద్యార్థులకు గురువు మీనంలో ఉండగా అనుకూలత తక్కువ. ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. రైతులు తొందరపాటుగా ఎవరి సలహాలు తీసుకోవద్దని, అనవసరంగా ఋణాలు చేయవద్దని సూచన. గర్భిణిలు నిత్యం ‘శ్రీమాత్రే నమః’ నామాన్ని జపిస్తూ ఉండండి. రాహు కేతువుల అనుకూలత తక్కువగా ఉన్నది.
చిత్తా నక్షత్రం వారికి సంబంధం లేని అంశాలలో కూడా దోషిగా విచారణ ఎదుర్కోవలసిన పరిస్థితులు తరచుగా ఎదురవుతాయి. మానసిక స్థితి బలహీనమవుతుంది. దురలవాట్లు వున్నవారు ప్రమాదాలలో పడే అవకాశం వుంది. అవివాహితులు వివాహ ప్రయత్నం చేయకుండా వుంటేనే మంచిది.
స్వాతీ నక్షత్రం వారికి తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా నిబ్బరంగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. అలంకరణ వస్తువులు, గృహాలంకరణ వస్తువుల కొనుగోలు కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా వుంటాయి.
విశాఖ నక్షత్రం వారు ధనసంబంధ లావాదేవీలను సరిగా నిర్వహించక ఇబ్బందుల్లో పడతారు. చేయవలసిన ముఖ్యమైన పనులు వదిలేసి, ఇతర పనులు వెంటపడి సమస్యలను కొని తెచ్చుకుంటారు. బుద్ధిస్థిరత్వం లేకుండా ప్రవర్తించి సమస్యలను పెంచుకుంటారు.
శాంతి: రోజూ తెల్లటి పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. తెల్ల జిల్లేడు, గరిక, మారేడుపత్రితో గణపతి దేవాలయంలో నిత్యం అర్చన చేయించండి. తొమ్మిది ముఖా రుద్రాక్షధారణ విశేషం.
ఏప్రిల్: పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఈ నెల వృత్తిరీత్యా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. శుభ కార్యాల్లో శుభవార్తలు వింటారు. పుణ్యకార్యాల్లో పొల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. రాహు, కేతు గ్రహశాంతి చేయించండి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య అనుకూలత ఉంటాయి. ప్రమోషన్ అవకాశం ఉంది.
మే: ఓర్పుగా వ్యవహరించండి. ఇబ్బందులు ఉండవు కాని, తొందరపాటును విడనాడాల్సిన కాలం. చివరివారంలో ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు 23వ తేదీ నుంచి ఒత్తిడి కలిగిస్తాయి. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
జూన్: పరిస్థితులతో సంబంధం లేకుండా ధైర్యం ప్రదర్శిస్తారు. శుక్ర సంచారం బాగుంది. వచ్చిపడే సమస్యలను తెలివిగా దాటవేయగలుగుతారు. వాహన చికాకులు తరుచుగా ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు చేసే వారికి చికాకులు ఉంటాయి. తెలియకుండా చేసిన పనుల వల్ల ఇబ్బందికర సంఘటనలు ఎదురవుతాయి.
జూలై: రానున్న మూడు నెలల్లో కుజుడి అనుకూలత లేదు. ప్రతినెలా కుజ గ్రహశాంతి అవసరం. అంతేకాదు ఇక్కడి నుంచి శని రాహు గురు కుజ కేతు గ్రహచారం కూడా అనుకూలం కాదు. ఇది మిమ్మల్ని భయభ్రాంతులను చేయడానికి చెప్పే అంశం కాదు. తగు జాగ్రత్తలతో వ్యవహరిస్తారనే ఉద్దేశంతో సూచిస్తున్నాము. నవగ్రహారాధన చేయండి.
ఆగస్టు: అంగారక సంచారం దోషం అష్టమంలో ఎక్కువకాలం ఉంటుంది. జన్మ జాతకంలో కుజుడు దోషసంచారంలో ఉన్నవారికి >ఇబ్బందులు ఎక్కువ కాగలవు. అందువలన మీ వ్యక్తిగత జాతకాన్ని ఈ నెలలో తప్పనిసరిగా శోధన చేయించుకోండి. ఉద్యోగ, వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి.
సెప్టెంబర్: 15వ తేదీ వరకు రవి, 24వ తేదీ వరకు శుక్రుడు అనుకూలిస్తారు. ఏదో ఒక విధంగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెడతారు. గతమాసం కంటే మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా పనులు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఋణ సౌకర్యం బాగుంటుంది.
అక్టోబర్: రవి కుజ శని గురు, బుధ, రాహు, కేతు అనుకూలత సరిగా లేదు. ప్రారంభంలో శుక్ర సంచారం కూడా సరిగాలేదు. ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవడం మంచిది. ప్రతి పనిలోనూ చికాకులు ఉంటాయి. ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేయించుకోండి. అవకాశం చూసుకొని నవగ్రహ హోమం చేయించుకోండి.
నవంబర్: మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. కేవలం శుక్ర సంచారం అనుకూలతతో ఈ నెల మంచి ఫలితాలు అందుకుంటారు. అడ్డంకులు ఎదురవుతున్నా, విజయం సాధించగలమనే ధైర్యంతో ముందుకు వెడతారు. అయితే ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మితభాషణ, ఓర్పు ఈ నెలలో మీకు శ్రీరామరక్ష అని గ్రహించండి.
డిసెంబర్: సహాయం చేయవలసిన సమయానికి మిత్రులు సహకరించపోవడంతో చాలా నిరుత్సాహం చెందుతారు. ప్రతి పనీ ఒత్తిడితో పూర్తవుతుంది. అయితే నష్టాలు ఉండవు. అనవసర ఆందోళనలు ఎక్కువ. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు వృథా కాలక్షేపం చేస్తారు.
జనవరి: చాలా అద్భుతమైన కాలం. గురు, రాహు, కుజ అనుకూలత లేకపోయినా, మిగిలిన గ్రహాల అనుకూల సంచారం వల్ల చాలా లాభాలు అందుకుంటారు. ప్రధానంగా ఈ నెల ప్రశాంతత ఎక్కువ. గతం నుంచి వస్తున్న సమస్యలకు పరిష్కారాలు సాధించడంలో గొప్ప నేర్పు ప్రదర్శిస్తారు. విచిత్రంగా ఉంటుంది ఈ కాలం.
ఫిబ్రవరి: బంధువులు, స్నేహితులతో కలసి చేసే పనులు, సంచారాలు మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. మితభాషణ చాలా అవసరం.అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. «కావలసిన సమయానికి డబ్బు అందకపోవడం, ఋణాల విషయంలో హామీలు సరిగా ఉండకపోవడం జరుగుతుంది.
మార్చి: ఒక విచిత్రకాలం. గురు శుక్రుల అనుకూలత తక్కువ. ప్రతి పనిలోనూ కోపతాపాలకు లోనవుతారు. ఆరోగ్య విషయంలో ఉష్ణప్రకోపానికి లోనవుతారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో ధన సౌకర్యం సరిగా అందదు. తరచుగా వాహన చికాకులు ఉంటాయి.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితాలు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment