వెలుగులో చీకట్లు ! | - | Sakshi
Sakshi News home page

వెలుగులో చీకట్లు !

Published Wed, Nov 20 2024 1:52 AM | Last Updated on Wed, Nov 20 2024 1:52 AM

వెలుగులో చీకట్లు !

వెలుగులో చీకట్లు !

రుణం దక్కిందన్న ఆనందం కాసేపు కూడా నిలవకుండా వచ్చిన దాంట్లో నుంచి కొంతమొత్తం నొక్కేస్తున్నారు. అదేమంటే మీకు రుణం వచ్చేందుకు అక్కడ తిరిగాం.. ఇక్కడ తిరిగాం.. వాళ్లకివ్వాలి.. వీళ్లకివ్వాలి అంటూ దబాయించి మరీ పేద మహిళల నోటికాడ డబ్బులు గద్దల్లా లాగేసుకుంటున్నారు. అడిగితే మళ్లీ రుణాలిప్పిస్తారో లేదో అంటూ భయపడుతూ.. వారి అడిగినంత ముట్టజెపుతూ కిమ్మనకుండా ఉంటున్నారు గ్రామీణ మహిళలు. డ్వాక్రా మహిళల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని రుణానికింతని రేటు కడుతూ అడ్డంగా దోచేస్తున్నారు మండలంలోని కొందరు వీఓఏలు.
వెలుగు పథకంలో వసూళ్ల పర్వం

చీరాల టౌన్‌: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ప్రభుత్వం వెలుగు పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా 10 మంది మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని 6 నెలల పాటుగా బ్యాంకులో పొదుపు చేసుకుంటే తర్వాత మండల వెలుగు అధికారులు గ్రూపునకు మొదటగా రూ.50 వేలు రుణం అందిస్తారు. అనంతరం గ్రూపు పనితీరు మెరుగుపర్చుకుని రూ.5 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణం తీసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లు (వీఓఏ) కొందరు రుణం దక్కాలంటే నగదు వసూళ్లు చేస్తున్నారు. చీరాల మండలంలోని గ్రామాల్లో ఉన్న వీబీకేలు చేస్తున్న వసూళ్లలో అధికారుల పాత్ర కూడా అధికంగా ఉందని గ్రామాల్లోని పొదుపు మహిళలు విమర్శిస్తున్నారు.

ఒక్కో రుణానికి ఒక్కో రేటు...

గ్రామాల్లోని వీఓఏలు ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. రూ.50 వేల రుణం మంజూరుకు ఒక్కో పొదుపు మహిళ నుంచి రూ.200 చొప్పున రూ.3 వేలు వసూళ్లు చేస్తున్నారు. రూ.లక్ష రుణానికి ఒక్కో మహిళ నుంచి రూ.500 చొప్పున రూ.5 వేలు, రూ.3 లక్షల రుణానికి రూ.600 చొప్పున రూ.6 వేలు, రూ.4 లక్షల రుణానికి రూ.8 వేలు, రూ.5 లక్షల రుణానికి ఒక్కో మహిళ నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. రూ.20 లక్షల రుణం తీసుకునే పొదుపు మహిళా గ్రూపు నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల చొప్పున రూ.20 వేలు వసూలు చేస్తూ పొదుపు మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా మలుచుకుని వీఏఓలు దోచుకుంటున్నారు. ఇలా మండలంలోని గ్రామాల్లో బ్యాంకు లింకేజీ రుణం వచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని, వారి ఖర్చులు కూడా ఉంటాయని ప్రచారం చేస్తూ పొదుపు మహిళల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

రూ.20లక్షల వరకు వసూలు..!

చీరాల మండలంలోని పొదుపు గ్రూపుల్లోని మహిళల వద్ద నుంచి సగటున ఏడాదికి గ్రూపు చెల్లింపుల కాలానికి వీఏఓలు అధికారుల సాయంతో రూ.20 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని సమాచారం. అధికారులు తమకు రుణం అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా తమకు రుణం వచ్చినందుకు ప్రతిసారి వీఏఓలకు చెల్లింపులు చేస్తున్నామని పొదుపు మహిళలు చెబుతున్నారు. ఏదేమైనా పొదుపు మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు వీఏఓ లాంటి మధ్యవర్తుల సాయంతో రూ.లక్షలు సొమ్ము చేసుకోవడం దారుణమని పలువురు వ్యాఖ్యా నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు గ్రామాల టీడీపీ నాయకుల పాత్ర కూడా ఉందని ఆయా గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

రుణం దక్కాలంటే..రొక్కం ఇచ్చుకోవాల్సిందే రుణం మంజూరుకు నగదు వసూళ్లు చేస్తున్న కొందరు వీఓఏలు అధికారుల అండతోనే గ్రామాల్లో వసూళ్లు! రుణానికింతని ధర నిర్ణయిస్తున్న వైనం

1948 గ్రూపులు.. 19,480 మంది మహిళలు...

చీరాల మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో వెలుగు పథకంలో 1948 మహిళా పొదుపు గ్రూపులు ఉండగా 19,480 మంది పొదుపు మహిళలు ఉన్నారు. ఈ గ్రూపులకు 2024లో గడిచిన 7 నెలలకు 592 గ్రూపులకు రూ.30.50 కోట్లు బ్యాంకు రుణాలను అందించారు. సీ్త్ర నిధి రూ.5.50 కోట్లు, ఉన్నతి పథకంలో రూ.30 లక్షల రుణాలు ఇచ్చారు. వీటిలో రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షల మేర బ్యాంకు లింకేజీ రుణాలను పొందుతున్న గ్రూపులు అనేకం ఉన్నాయి. చీరాల మండలంలో మేజర్‌ గ్రామ పంచాయతీలైన ఈపూరుపాలెంలో 475, వాడరేవులో 259, దేవాంగపురిలో 345, గవినివారిపాలెంలో 326, తోటవారిపాలెంలో 270తో పాటుగా మిగిలిన మైనర్‌ పంచాయతీల్లో పొదుపు గ్రూపులు అనేకం ఉన్నాయి. పొదుపు సంఘాలకు నెలవారీగా సమావేశాలను నిర్వహించడంతో పాటుగా గ్రూపుల పుస్తకాలను నిర్వహించేందుకు గ్రామ సంఘాలకు వీఓఏలను మండలంలో 56 మందిని నియమించారు. పొదుపు గ్రూపులకు నెలనెలా మీటింగులు, పుస్తకాల్లో నమోదులు, రుణం పూర్తి అయిన గ్రూపులకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయించడం వీరి పని. కానీ వీరు చేస్తున్నది మాత్రం రుణాల మంజూరుకు వసూళ్లు అని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు.

వెలుగు ఏపీఎం ఏమన్నారంటే....

ఈవిషయమై మండల వెలుగు పథకం ఏపీఎం మధుబాబును వివరణ కోరగా.. గ్రామాల్లోని వీఏఓలకు పొదుపు గ్రూపులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారికి ప్రభుత్వం జీతాలు కూడా ఇస్తుందని, రుణం వచ్చిన ప్రతిసారీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా వీఏఓలు పొదుపు గ్రూపుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తే ఫిర్యాదు చేయవచ్చని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వీఏఓల వసూళ్ల గురించి వెలుగు అధికారులకు ఫిర్యాదులు రాలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement