
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
బాపట్ల: వేసవి కాలంలో తాగునీటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండ తీవ్రత, వడగాల్పులు ఉంటాయని తెలిపారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విరామం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితిలో తాగునీరు, ఓఆర్‌ఎస్, పండ్ల రసాలు వంటివి తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఒంటరి వృద్ధ మహిళల ఆరోగ్యంపై ఆశా వర్కర్లు రోజు పర్యవేక్షించేలా చూడాలన్నారు. డయేరియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రకాల తాగునీటి పరీక్షలు చేయడానికి సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతి గురువారం రాత్రి డ్రమ్ములలోని నీటిని తీసివేయాలని, శుక్రవారం ఉదయం వాటిని ఎండబెట్టి సాయంత్రం నింపుకోవాలని ప్రజలను కోరారు. కుక్కల బెడద నివారించాలని అధికారులతో పేర్కొన్నారు. 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ కింద కార్డు జారీ కోసం ఈకేవైసీ చేయించాలని తెలిపారు.
పారిశుద్ధ్యంపై ఆరా
పారిశుద్ధ్యంపై కలెక్టర్ ఆరా తీశారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా వివరాలు సేకరించగా 42 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. రోజు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త, ప్రమాదకర వస్తువులను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. వాటిని ఎస్‌డబ్ల్యూపీపీ ప్రదేశంలో పడేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులలోని నీటి నిల్వలపై ఆరా తీశారు. తక్కువ లోతు గల బోర్ల నీటిని వాడవద్దని ప్రజలకు సూచించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించే సర్వేలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆరేళ్లలోపు పిల్లల ఆధార్ నమోదును 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా జేసీ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి డి.గంగాధర్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల డీఎల్‌డీవో విజయలక్ష్మి, వీక్షణ సమావేశం ద్వారా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం