
జగ్జీవన్‌రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడు
బాపట్ల :అణగారిన వర్గాల నుంచి వచ్చినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి ఎన్నో ఉన్నత పదవులను అలంకరించిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు మరుప్రోలు కొండలరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సభ శనివారం నిర్వహించారు. కొండలరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలోను, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలోను చురుగ్గా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించిన జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశపు మొట్టమొదటి కార్మిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన నిర్వహించిన పాత్ర గణనీయమైనదని, భారతదేశంలో హరిత విప్లవ సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు. 1974లో కరువు సంభవించినప్పుడు ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి రైతాంగం మన్ననలు పొందారన్నారు. తొలుత జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, పిన్నిబోయిన ప్రసాద్, జోగి రాజా, షోహిత్ తదితరులు పాల్గొన్నారు.
బాబూ జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్లటౌన్ : బాబూ జగ్జీవన్‌రామ్ జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అణగారిన వర్గాలు వివక్షకు గురౌతున్న తరుణంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిస్వార్థ పోరాటాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అంటరానితనం వంటి అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపటంలో తన వంతు కృషి చేశారన్నారు. ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమాల్లోనూ గాంధీజీతో కలిసి అడుగులు వేశారన్నారు.
అలాంటి గొప్ప నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడుని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆదర్శనీయమైన మహోన్నత వ్యక్తి నుంచి సద్గుణాలను అలవర్చుకుని సమాజం కోసం మనవంతు కృషి చేయాలన్నారు.ఏఆర్ డీఎస్పీ విజయసారధి, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఎస్‌బీ సీఐ నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జగ్జీవన్‌రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడు