భద్రాచలం పట్టణ వ్యూ
ఆ ఐదు పంచాయతీలను కలపాలి..
ప్రజాభీష్టం లేకుండా ఏకపక్షంగా ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలం మండలంలో విలీనం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భౌగోళికంగా భద్రాచలంతో ఆ ప్రాంతాలకు ఉన్న అనుబంధంతో తమను ఇక్కడే కొనసాగించాలని ఆయా గ్రామాల వారు పలుమార్లు బంద్‌లు, రాస్తారోకోలు చేశారు. వీరి ఉద్యమానికి బీఆర్‌ఎస్ మినహా స్థానిక రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి.
ఇటీవల భద్రాచలం వచ్చిన గవర్నర్ తమిళి సైకి సైతం ఆయా గ్రామాల వారు తమ సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు.
భద్రాచలం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ దశాబ్ద కాలంలో రాష్ట్రమంతా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా, భద్రాచలం ఏజెన్సీ మాత్రం దిశా నిర్దేశం, అభివృద్ధి లేక నిస్తేజంగా మారింది. రాష్ట్ర, జిల్లాల విభజనలో ముక్కలుగా చీలిపోయిన భద్రాచలం ఏకాకిగా మిగిలింది. పలు ముఖ్యమైన కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో దిక్కూ మొ క్కూ లేకుండా ఉండిపోయింది.
భద్రాచలం అంటే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికే పరిమితమైన ఖ్యాతిని కూడగట్టుకుంది. రాష్ట్రం మొత్తం దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో భద్రాచలానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా పాలకులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు.
మండల పరిషత్ పోయె.. పాలక మండలి లేదాయె..
మండలాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేసే మండల పరిషత్ సైతం భద్రాచలంలో లేకపోవడం శోచనీయం. ఈ మండలంలో గ్రామాలు లేకపోవడంతో మండల పరిషత్, జెడ్పీటీసీ హోదాలను రద్దు చేశారు. దీంతో ఇక్కడున్న మండల పరిషత్ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పడిన ఆళ్లపల్లి మండలానికి తరలించారు. 80 వేలకు పైగా జనాభా ఉన్న భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో పాలకవర్గం లేక ఐదేళ్లు కావస్తోంది. 2018 ఆగస్టులో గ్రామ పంచాయతీ పాలకవర్గం ముగిసినా, ఇప్పటి వరకు మళ్లీ ఎన్నికలు జరగలేదు.
భద్రాచలం, సారపాకను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం ప్రకటించడం, దీనిపై గిరిజన సంఘాలు హైకోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత భద్రాచలంను మూడు, సారపాకను రెండు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడమే కాక అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే రాష్ట్ర, జిల్లా విభజనతో ఇప్పటికే భద్రాచలం నష్టపోయిందని, మళ్లీ పంచాయతీల విభజనతో మరింత నష్టపర్చవద్దని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో స్థానికులు గవర్నర్ తమిళి సైకి విన్నవించారు. దీంతో ఆ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా తిప్పి పంపారు.
ఇలా అనేక పరిణామాలతో భద్రాచలం గ్రామపంచాయతీ ఐదేళ్లుగా పాలకవర్గం లేకుండానే సాగుతోంది. ఇక గతంలో భద్రాచలం డివిజన్‌లో కొనసాగిన అనేక విద్యాలయాలు, కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో పట్టణం కళ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రాచలానికి ఇస్తామన్న రూ.100 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఈ దశాబ్దిలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అతిపెద్ద ఏజెన్సీ చిన్నబోయింది..
తెలంగాణ ఆవిర్భావంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాభవానికి గండి పడింది. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్‌లో ఉన్న కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, భద్రాచలం పట్టణం మినహా ఇతర గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయి. దీంతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన భద్రాచలం ఏజెన్సీ చిన్నదైంది. భద్రాచలం మండలంలోని యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామపంచాయతీలను సైతం ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో పట్టణానికే పరిమితమై మండల పరిధి కుచించుకుపోయింది. ఇక జిల్లాల పునర్విభజనతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. రాష్ట్ర విభజనకు ముందు ఎనిమిది మండలాలతో వర్థిల్లిన భద్రాచలం ప్రస్తుతం మూడు మండలాలకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment