భద్రాద్రి: రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్డుల నిర్మాణంపై గతేడాది ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇందులో వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) ఎయిర్‌పోర్టుల ప్రస్తావనే వచ్చింది తప్పితే కొత్తగూడెం ఊసే లేదు. అప్పటి వరకు తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎప్పుడొచ్చినా కొత్తగూడెం పేరు తప్పకుండా ఉండేది. మరోవైపు విమాన ప్రయాణ, రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశయానం అవకాశం కల్పించేందుకు కేంద్రం ఉడాన్ (ఉడే దేశ్‌కి ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా కొత్తగూడెం పేరు లేకపోవడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొత్తగా ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆమె చూపిన చొరవతో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనల్లో కొత్తగూడెం పేరు కూడా చేరింది. అయితే గత 15 ఏళ్లుగా ఎయిర్‌పోర్టు అంశం విక్రమ్ బేతాళ్ కథలా మారిపోయింది.
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తాయి. ఆ తర్వాత విడతల వారీగా నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాయి. వారి సూచనలకు అనుగుణంగా, జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సర్వేలు చేపడతాయి. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాయి. అంతే ఇక ఆ తర్వాత ఉలుకూపలుకూ ఉండదు. మూడుసార్లు ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది.
విమానాశ్రయం ముచ్చట సాగిందిలా..
► కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2008లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నాటి నుంచి 2014 వరకు కాగితాల్లో ప్రతిపాదనలే తప్ప క్షేత్ర స్థాయిలో అంగుళం పని కూడా జరగలేదు.
► తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఎయిర్‌పోర్టు పనుల్లో దూకుడు పెంచారు.
► ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం 2015 జనవరి నుంచి 2017 మార్చి వరకు అన్వేషణ సాగింది.
► పాల్వంచ మండలం పునుకుడుచెలక దగ్గర 1600 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు.
► ఈ స్థలాన్ని తమకు అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని 2017 మార్చిలో కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.
► పునుకుడుచెలక దగ్గరున్న స్థల సేకరణకు పర్యావరణ, అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి.
► 2019లో పాల్వంచ మండలంలో సర్వే నంబర్ 441లో ఉన్న 700 ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. శ్రీనివాసకాలనీ నుంచి బంగారుజాల వరకు ఉన్న భూములను ఎంపిక చేసి 2020లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిశీలనకు పంపారు.
► విమానాలు ల్యాండ్, టేకాఫ్ అయ్యేందుకు బంగారుజాల దగ్గరున్న స్థలం అనువైనదా, కాదే అనే అంశాలను ఏఏఐ బృందం 2021లో పరిశీలించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన శాఖాపరమైన అనుమతుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు పనులు ముందుకు సాగలేదు.
దృష్టిపెట్టండి..
పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా భద్రాద్రి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశ నలుమూల నుంచి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆకాశయాన సౌకర్యం లేక సింగరేణి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, పేపర్‌బోర్డు తదితర పరిశ్రమల్లో పనిచేసే ఉన్నతాధికారులు, నిపుణులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై అవసరమైన దృష్టిపెట్టడం లేదనే అపవాదు ను జిల్లా ప్రజాప్రతినిధులు మూటగట్టుకున్నారు.
ఇప్పటికై నా ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆకాశయానం జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పదిహేనేళ్లుగా ఇదుగో అదుగో అంటూ ప్రకనటలు చేయడం, ఆపై సర్వేలు అంటూ హడావుడి చేయడం మినహా ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో అడుగు ముందుకు పడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment