సాగని సీతమ్మ సాగర్‌ | Sakshi
Sakshi News home page

సాగని సీతమ్మ సాగర్‌

Published Sat, May 25 2024 4:25 PM

సాగని సీతమ్మ సాగర్‌

ఏడాది కాలంగా నిర్మాణ పనులకు బ్రేక్‌
● పర్యావరణ అనుమతులపై అభ్యంతరాలు ● గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసుల జారీ ● అనుమతులు వస్తేనే పనులు ముందుకు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర పర్యావరణ శాఖ లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా ఏడాది కాలంగా సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కేంద్రంతో చర్చించి అవసరమైన అనుమతులు సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఎన్‌జీటీ విచారణ

అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్‌ నిర్మాణ పనుల కారణంగా తాము నష్టపోతున్నామని, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందారు. దీంతో వారు ముందుగా హై కోర్టును, ఆ తర్వాత నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌టీజీ)ను ఆశ్రయించారు. నిర్వాసితులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఎన్‌జీటీ నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలంటూ 2023, మే 29న ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి నివేదిక ఇవ్వాలంటూ ద్విసభ్య కమిటీని నియమించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

ఎన్‌జీటీ ఆదేశాలతో మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌లో రీజినల్‌ డైరెక్టర్‌ (హైదరాబాద్‌), గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డులో ఎస్‌ఈ ర్యాంక్‌కు తక్కువకాని ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ జూన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. నిర్వాసితులతో మాట్లాడి, రికార్డులు పరిశీలించింది. చివరకు 2023, జూలై 15న కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖకు 2023, సెప్టెంబరు 23న నోటీసులు జారీ అయ్యాయి. అందులో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ (ఈసీ) రాకుండా నిర్మాణ పనులు ఎందుకు చేపట్టారో తెలపాలంటూ కోరింది. అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తే అవకాశమున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఈసీ కియరెన్స్‌ లేకుండా 35 శాతం వరకు నిర్మాణ పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆగిన పనులు

గత ప్రభుత్వ హయాంలో ఓవైపు నిర్మాణ పనులు చేపడుతూనే మరోవైపు కేంద్రం నుంచి ఈసీ అనుమతుల కోసం ప్రయత్నాలు జరిగాయి. 2023 జూన్‌ నాటికి సీతమ్మ సాగర్‌ బ్యారేజీ నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తి చేయాలనే లక్ష్యంతో భారీ ఎత్తున యంత్రసామగ్రి, వర్క్‌ఫోర్స్‌ను నిర్మాణ స్థలికి తరలించారు. ఇరిగేషన్‌ అధికారులు సమర్పించిన డీపీఆర్‌కు పదేపదే కేంద్రం కొర్రీలు వేయడంతో అనుమతులు రాలేదు. ఈ అంశంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో 2023, మే 29 నుంచి పనులు ఆపేశారు. నిర్మాణ స్థలం నుంచి భారీ యంత్రాలను తరలించారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసి గుడారాలు ఖాళీ చేశారు. ఏడాది కాలంగా నిర్మాణ ప్రదేశంలో అటున్న ఇటుక తీసి ఇటు పెట్టలేదు.

సీతారామ పూర్తయితే..

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్యన గోదావరి నదిపై సీతమ్మ సాగర్‌ పేరుతో బ్యారేజీ నిర్మిస్తోంది.

ఎప్పుడు మొదలయ్యేనో..

సీతమ్మసాగర్‌ బ్యారేజీ పనులపై 2023, సెప్టెంబరు 23న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అందాయి. అప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆ తర్వాత నవంబరులో నోటిఫికేషన్‌ జారీ, డిసెంబరులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖల ఫోకస్‌ అంతా మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన లోపాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఈలోగా 2024, మార్చి 16న పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో మరోసారి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఫలితంగా సీతమ్మసాగర్‌ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో జాప్యం నెలకొంటోంది. మరోవైపు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. పంప్‌ హౌస్‌ల నిర్మాణం పూర్తయి రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సీతమ్మ సాగర్‌కు నిర్మాణ అనుమతులు సాధించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement