ప్రచారానికి తెర | Sakshi
Sakshi News home page

ప్రచారానికి తెర

Published Sun, May 26 2024 4:10 AM

ప్రచా

ఉమ్మడి జిల్లాలో హోరెత్తించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
● చివరి రోజున ఆత్మీయ సమ్మేళనాలు ● ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి ● అధిక సంఖ్యలో పట్టభద్రులు ఉన్న ప్రాంతాలపై నజర్‌

ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024

సాక్షిప్రతినిధి, ఖమ్మం: నల్లగొండ – ఖమ్మం – వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం తెరపడింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అగ్రనేతలు ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ బలపరచిన తీన్మార్‌ మల్లన్న, ఏనుగుల రాకేష్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయాన ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూరి అశోక్‌కుమార్‌ మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రచారం ముగియడంతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడంపై పార్టీలు దృష్టి సారించాయి.

సాధారణ ఎన్నికలను తలపించేలా..

సాధారణ ఎన్నికలను తలపించేలా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగింది. ఇది బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కావడం, మరోవైపు కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం.. ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలవడం.. మరోపక్క ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ భావిస్తుండడంతో ప్రచారం రసవత్తరంగా సాగింది. కాంగ్రెస్‌ తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ అభ్యర్థి నామా, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్‌, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూరి అశోక్‌కుమార్‌ సైతం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలను వివరిస్తూ ప్రచారం చేయగా.. ఆయనకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పలువురు మద్దతుగా నిలిచారు.

ఓటర్ల ప్రసన్నం కోసం..

ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. ఓటర్లను నేరుగా కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తూనే ఫోన్‌ చేయడమే కాక వాయిస్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండడంతో అభ్యర్థులు స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించి చివరిరోజు ప్రచారం చేయించారు. ఇప్పటి వరకు అగ్రనేతలు ప్రచారం చేసినా, చివరిరోజు స్థానిక నేతలు పట్టభద్రులతో భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇక మూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించలేని స్వతంత్ర అభ్యర్థులు వాయిస్‌ మెసేజ్‌లపైనే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యాన అభ్యర్థుల వాయిస్‌ మెసేజ్‌లతో పట్టభద్రుల సెల్‌ఫోన్లు మార్మోగాయి.

అమల్లోకి 144 సెక్షన్‌

ఎమ్మెల్సీ పోలింగ్‌ సమీపించడంతో 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఇది అమల్లో ఉండనున్నందున ఒక ప్రాంతంలో ఎక్కువ మంది గుమికూడడాన్ని నేరంగా పరిగణిస్తారు. కర్రలు, జెండాలు, టపాసులు, ఇతర ఆయుధాలతో సంచరించడం, పోలింగ్‌ స్టేషన్‌కు కిలోమీటర్‌ పరిధిలో సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. ఇక ఎన్నికల రోజున పోలింగ్‌ స్టేషన్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టనున్నారు.

న్యూస్‌రీల్‌

ఆ ప్రాంతాలే లక్ష్యంగా..

ఎక్కువ మంది పట్టభద్ర ఓటర్లు ఉన్న ప్రాంతాలను అభ్యర్థులు గుర్తించారు. ఆయా ప్రాంతాలే లక్ష్యంగా ఇప్పటికే ప్రచారం చేయగా, మిగిలిన సమయంలోనూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా పార్టీల నాయకులు ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఖమ్మం, ఖమ్మంరూరల్‌, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు తదితర ప్రాంతాలపై అభ్యర్థులు ఎక్కువగా దృష్టి సారించి నేరుగా కలిసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నాటి నుంచి హోరాహోరీగా, గతంలో ఎన్నడూ లేనట్టుగా పట్టభద్రుల ఎన్నిక ప్రచారం జరగడం ఆసక్తి కలిగిస్తోంది.

ప్రచారానికి తెర
1/2

ప్రచారానికి తెర

ప్రచారానికి తెర
2/2

ప్రచారానికి తెర

Advertisement
 
Advertisement
 
Advertisement