ఆయిల్‌ఫెడ్‌లో అంతర్యుద్ధం ! | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ఫెడ్‌లో అంతర్యుద్ధం !

Published Wed, Jan 29 2025 12:51 AM | Last Updated on Wed, Jan 29 2025 12:50 AM

ఆయిల్‌ఫెడ్‌లో అంతర్యుద్ధం !

ఆయిల్‌ఫెడ్‌లో అంతర్యుద్ధం !

● అశ్వారావుపేట ఫ్యాక్టరీలో క్రూడ్‌ కుంభకోణం ● రికవరీ తగ్గించేందుకేనంటూ ప్రచారం ● రేగళ్లపాడు నర్సరీ తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ● కింది స్థాయి ఉద్యోగులే బలి..

అశ్వారావుపేట : ఆయిల్‌ఫెడ్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీలో ఆఫ్‌టైప్‌ మొక్కల తొలగింపు అంశం వారం రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారగా.. ఆయిల్‌ఫెడ్‌ అధికారులు దీనికి సంబంధం లేని ఇద్దరు చిరుద్యోగులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. కోస్టారికా నుంచి సీడ్‌ లింగ్స్‌ ఎంపిక చేసిన ఉన్నతాధికారులెవరు.. వాటికి అనుమతిచ్చిందెవరు.. అనే అంశం బయటకు పొక్కకుండా చిరుద్యోగులపై వేటు వేయగా దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశాన్ని మరిపించేందుకు అధికారులు అశ్వారావుపేట ఫ్యాక్టరీని వేదికగా చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ ఆయిల్‌ఫెడ్‌లో కుంభకోణాలకు పుట్టినిల్లు. ఓ మాటలో చెప్పాలంటే ఆయిల్‌ఫెడ్‌లో కుంభకోణాలపై ఎవరైనా డాక్టరేట్‌ చేయాలంటే ఇక్కడ జరిగిన ఉదంతాలు మంచి రిఫరెన్స్‌గా పనికొస్తాయి. 2012 – 2014 మధ్య కాలంలో ఇక్కడ జరిగిన కుంభకోణాలను నాడు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఓ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ జైలు పాలయ్యారు కూడా.

ఇప్పుడేం జరిగింది..?

అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్‌ ఫ్యాక్టరీలో జరిగిన గత అక్టోబర్‌లో గానుగాడిన ముడి చమురును ఆనెల స్టాక్‌లో చూపలేదు. అయితే ఈ ఒక్క తేడా ప్రస్తుత ఆయిల్‌ ఇయర్‌ (నవంబర్‌ 2024 – అక్టోబర్‌ 2025)లో రాష్ట్రంలో సాగయ్యే పామాయిల్‌ గెలల ధరపై ప్రభావం చూపుతుంది. అక్టోబర్‌లో ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌, గానుగాడగా వచ్చిన క్రూడాయిల్‌లో అమ్మగా మిగిలిన స్టాక్‌ను 68.250 టన్నులు తక్కువగా చూపారు. ఈ స్టాక్‌ను ఆలస్యంగా డిసెంబర్‌ నెలలో కలిపి రికార్డుల్లోకి ఎక్కించారు. ఏటా ఆయిల్‌ ఇయర్‌లో వచ్చిన దిగుబడిని బట్టి రానున్న ఏడాదికి గెలల ధరను ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయిస్తుంది. ఈ ధరనే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ 68.250 టన్నుల కోతతో రైతులు 0.15 శాతం నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా రైతులను నష్టపరిస్తే ఆయిల్‌ఫెడ్‌కు లాభమేంటి అనుకుంటే పొరపాటే. రికవరీ శాతాన్ని తగ్గించడం ద్వారా ప్రైవేటు కంపెనీల నుంచి అధికారులు లబ్ధి పొందుతారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎక్కడా లిఖితపూర్వక ఆదేశాల్లేవు..

అక్టోబర్‌ నెల స్టాక్‌ను దాచి ఉంచిన విషయంలో ఉన్నతాధికారుల నుంచి లిఖిత పూర్వక ఆదేశాలు లేకున్నా మేనేజర్‌ అలా చేయాల్సి వచ్చింది. నిత్యం క్రషింగ్‌, అమ్మకం, నిల్వ వివరాలను హైదరాబాద్‌లోని హెడ్‌ ఆఫీస్‌కు రిపోర్టు పంపుతుంటారు. ప్రతి నెలా ఇలా నిల్వలను దాచి ఉంచని అధికారులు.. ఆయిల్‌ ఇయర్‌ ముగింపులోనే ఎందుకు చేశారనేది అనుమానాలకు తావిస్తోంది. ఆయిల్‌ఫెడ్‌ అనేది ఓ ప్రత్యేక సామ్రాజ్యం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది తప్పులు చేయక తప్పదనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఘటనలో అశ్వారావుపేట ప్లాంట్‌ మేనేజర్‌ పాత్ర కంటే ఉన్నతాధికారుల పాత్రే అధికంగా ఉంటుందని రైతులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలపై ఆయిల్‌ఫెడ్‌ జీఎం సుధాకర్‌ రెడ్డిని వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement