పోరుబాటలో ‘ఉపాధి’ సిబ్బంది
● సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు ● వచ్చే నెల 12 వరకు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ● మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు ● జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బంది
చుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది నిరసన బాట పట్టారు. సకాలంలో వేతనాలు అందక అధికారులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీఓలకు వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలను విన్నవించారు. ఆందోళన కార్యక్రమాలను వచ్చే నెల 12 వరకు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 29, 30 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీఓలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేత, 31, ఫిబ్రవరి 1న దిబ్బంది పెన్‌డౌన్, 2,3 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను, 4న కలెక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించడం, 5న కలెక్టరేట్ ఎదుట నిరసన, 6న టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతలకు వినతి పత్రాలు, 7న ప్రజా భవన్‌లో వినతిపత్రం, 8న హైదరాబాద్‌లోని పీఆర్ అండ్ సీఆర్‌డీ కమిషనర్ కార్యాలయంలో వినతులు, 9,10 తేదీల్లో మంత్రులకు వినతి పత్రాలు, 11న కమిషనర్ పీఆర్ అండ్ సీఆర్‌డీ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తదితర కార్యక్రమాలు చేపట్టాలని, 12న కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేయాలని నిర్ణయించారు. అప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు.
వేతన వెతలు..
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఏపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు మొత్తం 219 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఏపీవోలు 21 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 21 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు 105 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 72 మంది ఉన్నారు. వీరికి గత నవంబర్ నుంచి వేతనాలు అందడంలేదు. ప్రతినెలా ఎఫ్‌టీఓ(ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్) జనరేట్ చేసి పంపుతున్నా వేతనాలు విడుదల చేయడంలేదు. రాష్ట్రశాఖలో బడ్జెట్ లేకపోవడంతోనే వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు పేర్కొంటుండగా, సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులరైజేషన్ చేయాలని, ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని, పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఉపాధి సిబ్బంది నిరసనతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు, ఉపాధి పనులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లాలో నిర్దేశించిన పనిదినాల లక్ష్యం మార్చి 31 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. కూలీలను పనులకు రప్పించటం, హాజరు నమోదు చేయడం వంటి పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
ఇబ్బంది పడుతున్నాం
ఉపాధి హామీ పథకం సిబ్బంది వేతనాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు సకాలంలో జీతాలు అందుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
–పిల్లి నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్, చుంచుపల్లి
వచ్చే నెల 12 వరకు నిరసనలు
న్యాయపరమైన సమస్యలతో పాటు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేపడుతున్నాం. వచ్చే నెల 12 వరకు రోజువారీగా ఆందోళనలు కొనసాగిస్తాం. శాంతియుత నిరసనల ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులను అందరినీ కలుస్తాం.
–రఘుపతి, ఏపీఓ, చుంచుపల్లి
Comments
Please login to add a commentAdd a comment