● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల ● ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, ఆ రోజు నుంచి 10 వరకు నామినేషన్లు ● 11న పరిశీలన.. 13న ఉపసంహరణ ● 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు
ఖమ్మం సహకారనగర్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయడంతో కోలాహలం మొదలైంది. ఇప్పటి వరకు పోటీలో నిలిచేందుకు ఆసక్తి చూపించిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేయగా.. షెడ్యూల్ ప్రకటనతో ఆశావహులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఓటర్ల నమోదు ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 24 పోలింగ్ బూత్లు ఉండగా 3,955 మంది ఓటర్లుగా తేలారు. ఇందులో పురుషులు 2,300, మహిళలు 1655 మంది ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో 23 మండలాల పరిధిలో 23 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 1,949 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,038 మంది, మహిళలు 941 మంది ఉన్నారు. ఇంకా అర్హులైన వారు ఉంటే ఈనెల 31 వరకు కూడా ఓటు నమోదుకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అమల్లోకి వచ్చిన కోడ్..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లవుతుంది. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(ఎఫ్ఎస్టీ), మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీఎంసీ), వీడియో సర్వైలెన్స్ టీమ్(వీఎస్టీ) ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 13 వరకు అవకాశం ఉంటుంది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, మార్చి 3న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment