రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిచారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జేఈఈ మెయిన్స్ ప్రశాంతం
సుజాతనగర్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో స్థానిక అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 120 మందికి ఉదయం షిఫ్ట్‌లో 117 మంది హాజరుకాగా, మధ్యాహ్నం షిఫ్ట్‌లో 119 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
డీడీఎన్ నిధులు విడుదల
ఖమ్మంగాంధీచౌక్ : వెనుకబడిన ఆలయాల నిర్వహణకు రూపొందించిన ధూప దీప నివేదన(డీడీఎన్)పథకం నిధులు విడుదలయ్యాయి. 2024 నవంబర్, డిసెంబర్ నెలల పెండింగ్ బకాయిలను అర్చకుల ఖాతాల్లో దేవాదాయ శాఖ అధికారులు జమ చేశారు. ఖమ్మం జిల్లాలోని 330, భద్రాద్రి జిల్లాలోని 120 దేవాలాయల్లో పనిచేస్తున్న అర్చకులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున వారి ఖాతాల్లో జమయ్యాయి.
‘ఎస్సారెస్పీ’ భూసేకరణకు అధికారుల పరిశీలన
తిరుమలాయపాలెం: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 54వ ప్యాకేజీలో సేకరించాల్సిన భూముల కోసం మండలంలోని ఇస్లావత్‌తండా నుంచి తిరుమలాయపాలెం వరకు ఆయా గ్రామాల్లోని ఎస్సారెస్పీ కాల్వలను సీడబ్ల్యూసీ అధికారులు శ్రీనివాస్, శరణ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత భూముల విలువ, ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలపై స్థానిక ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. పాలేరు నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో ఇంకా 15 ఎకరాల భూమిని కాల్వల నిర్మాణం కోసం సేకరించాల్సి ఉండగా, ఎన్ని నిధులు అవసరమనే విషయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈలు బాణాల రమేష్‌రెడ్డి, మన్మథరావు, ఏఈ వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment