ఎవరికీ పట్టని ‘ఉద్యానం’! | - | Sakshi
Sakshi News home page

ఎవరికీ పట్టని ‘ఉద్యానం’!

Published Thu, Jan 30 2025 12:53 AM | Last Updated on Thu, Jan 30 2025 12:53 AM

ఎవరిక

ఎవరికీ పట్టని ‘ఉద్యానం’!

● జిల్లాలో మిర్చి, మామిడి, కూరగాయల సాగు ● మార్కెటింగ్‌కు, నిల్వలకు అవకాశాల్లేక అవస్థలు ● ఫలితంగా తక్కువ ధరకే కొంటున్న వ్యాపారులు ● కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలని కోరుతున్న రైతులు

విక్రయమే అసలు సమస్య

దశాబ్ద కాలంగా కూరగాయలు పండిస్తున్నాం. పంట ఉత్పత్తులను విక్రయించడం సమస్యగా మారింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక దళారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.

– మంచె రమేష్‌, రైతు, ఇల్లెందు మండలం

కోల్డ్‌స్టోరేజీలు నిర్మించాలి

ఉద్యాన పంటలు కోయగానే విక్రయిండం సాధ్యం కాదు. కోసిన పంటను ధర పలికే వరకు భద్రపరుచుకునేందుకు జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలు లేవు. ప్రతి వ్యవసాయ మార్కెట్‌లోనూ ఒక కోల్డ్‌స్టోరేజీ నిర్మించాలి.

– బానోత్‌ సంతు, రైతు, ఇల్లెందు మండలం

ఇల్లెందురూరల్‌: జిల్లా ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా ఉద్యాన పంటలకు తగిన ప్రోత్సాహం లభించడంలేదు. పంట ఉత్పత్తులకు మార్కెటింగ్‌, నిల్వలకు కోల్డ్‌ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 25వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక మామిడి పంట ఉమ్మడి జిల్లాలో 53 వేల ఎకరాల్లో సాగవుతుండగా, ఖమ్మం జిల్లాలో 42 వేల ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 11 వేల ఎకరాల్లో సాగవుతోంది. కూరగాయలు భద్రాద్రి జిల్లాలో సుమారు 15వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాల్లో పదివేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

మార్కెట్‌ సౌకర్యం లేక..

మిర్చి, మామిడి పంటలకు, కూరగాయలకు జిల్లాలో కనీసం మార్కెట్‌ సౌకర్యం లేదు. దీంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ధర వచ్చే వరకు కూరగాయలతోపాటు మిర్చి పంటను భద్రపర్చుకునేందుకు జిల్లాలో ఒక్క కోల్డ్‌స్టోరేజీ కూడా లేదు. ఇందుకోసం ఖమ్మం జిల్లా వెళ్లాల్సివస్తోంది. మిర్చి విక్రయాలకు కూడా ఖమ్మం మార్కెట్‌కు తరలించాల్సి వస్తోంది. ఇక మామిడిని ఖమ్మం, హైదరాబాద్‌, వరంగల్‌ మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో ఉద్యాన రైతులు వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది.

ఉద్యానవన అధికారుల పర్యవేక్షణేది..?

మూడేళ్లుగా మిర్చి, మామిడి పంటలను, కూరగాయల తోటలను చీడపీడలు ఆశిస్తున్నాయి. నల్లి ప్రభావం అధికంగా ఉండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ తరుణంలో రైతులకు మెళకువలు చెప్పి అప్రమత్తం చేయాల్సిన ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

సాగుకు సెలవు ప్రకటించినా..

మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో స్థానికంగా వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి విక్రయాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వ్యాపారుల మాయాజాలంతో కనీసం పెట్టుబడి కూడా ఎల్లని పరిస్థితి ఎదరవుతోంది. ఇలా వరుసగా నష్టాలు రావడంతో గతేడాది జిల్లాలోని అత్యధిక సంఖ్యలో రైతులు కూరగాయల సాగుకు సెలవు ప్రకటించారు. అయినా ఉద్యానశాఖతోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదు.

అందుబాటులోలేని కోల్డ్‌ స్టోరేజీలు

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. అనుబంధంగా గోదాములను సైతం నిర్మించారు. కానీ ఎక్కడా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇతర పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలైన మిర్చి, పండ్లు, కూరగాయల కొనుగోలుకు కోల్డ్‌స్టోరేజ్‌ అందుబాటులో ఉండటం తప్పనిసరి. కానీ జిల్లాలో వాటి నిర్మాణంపై మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎవరికీ పట్టని ‘ఉద్యానం’!1
1/2

ఎవరికీ పట్టని ‘ఉద్యానం’!

ఎవరికీ పట్టని ‘ఉద్యానం’!2
2/2

ఎవరికీ పట్టని ‘ఉద్యానం’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement