అటవీ అనుమతులు రాగానే రహదారి | - | Sakshi
Sakshi News home page

అటవీ అనుమతులు రాగానే రహదారి

Published Thu, Jan 30 2025 12:53 AM | Last Updated on Thu, Jan 30 2025 12:53 AM

అటవీ అనుమతులు రాగానే రహదారి

అటవీ అనుమతులు రాగానే రహదారి

భద్రాచలం/బూర్గంపాడు: మారుమూల అటవీ గ్రామమైన శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి అటవీశాఖ అనుమతులు రాగానే రహదారి సౌకర్యం కల్పిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ తెలిపారు. సారపాకకు సమీపంలోని శ్రీరాంపురం ఎస్టీకాలనీకి రహదారి సౌకర్యం కల్పించేందుకు బుధవారం ఫారెస్ట్‌ అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో 67 కుటుంబాలకు చెందిన 270మంది ఆదివాసీలు ఉంటున్నారని, వీరికి రహదారి సౌకర్యం లేకపోవటంతో ప్రతిఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. రహదారి నిర్మాణానికి 2.37 కిలోమీటర్ల వరకు అటవీశాఖ అనుమతులు అవసరంకాగా, ప్రతిపాదనలను పంపించామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున పనులు ప్రారంభం ఆలస్యమవుతుందని అన్నారు.

గిరిజన మహిళల స్వయం ఉపాధి భేష్‌

ఏజెన్సీలోని గిరిజన మహిళలు స్వయం ఉపాఽధి సాధనలో ముందంజలో ఉండడం అభినందనీయమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. భద్రాచలం ఎంపీడీఓ కార్యాలయంలో నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి మహిళ ట్రైబల్‌ లియబిలిటీ గ్రూప్‌ న్యూట్రిషన్‌ మిక్స్‌, డ్రై మిక్స్‌ యూనిట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రై మిషన్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ గిరిజన యువతులు రూ.40 లక్షల ఖర్చుతో యూనిట్‌ ప్రారంభించారని, ఇందులో రూ. 24 లక్షల సబ్సిడీ వచ్చిందని చెప్పారు. అనంతరం సూరప్ప ఫ్లై యాష్‌ మేకింగ్‌ బ్రిక్స్‌ యూనిట్‌ నిర్మాణానికి రెండో విడతగా విడుదలైన రూ.9 లక్షల చెక్కును యూనిట్‌ సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నందున త్వరగా ఇటుకల తయారీ యూనిట్‌ నిర్మించి, విక్రయించాలని సూచించారు.

భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌

మెనూ సక్రమంగా అమలు చేయాలి

దుమ్ముగూడెం : నూతన మెనూ అమలు చేయాలని, 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్‌ నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ ఆదేశించారు. బుధవారం మండలంలోని రామచంద్రుని పేట గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. వంటశాలను, పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి పిల్లలతో మాట్లాడుతూ ప్రతి సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలని చెప్పారు. మెనూ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్‌రాజ్‌, మసూద్‌, ముజాహిద్‌, సునీల్‌, రమేష్‌, మహేష్‌, హరికృష్ణ, రామ్‌ కుమార్‌తోపాటు రామమ్మ, రాధమ్మ, క్రాంతి, ఆంజనేయులు, మానస, రాధమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు, హెచ్‌ఎం బట్టు రాములు, వార్డెన్‌ అరుణ్‌ కుమారి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement