సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్‌తో కలిసి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని..
● లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన రైతు వనపర్తి వీరభద్రం.. తనకు 68 ఏళ్లు వచ్చింనదున వ్యవసాయం చేయలేకపోతున్నానని, వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేయగా డీఆర్‌డీఓకు ఎండార్స్ చేశారు.
● సీతారామ ప్రాజెక్టు కింద నష్టపోయిన తమ భూములకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, బ్యాంకు సిబ్బంది కలిసి తమకు మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకుని, ఆ డబ్బును వారి ఖాతాల్లో వేసుకున్నారని అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. తమకు పోడుభూములు ఇప్పిస్తామని, భూముల్లో బోర్లు వేయిస్తామని నమ్మించారని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చేసిన దరఖాస్తు చేయగా ఎస్పీకి ఎండార్స్ చేశారు.
● పాల్వంచ నవభారత్ గాంధీనగర్‌లో మున్సిపల్ రోడ్డు, డ్రైనేజీపై ఉన్న స్థలంలో నలుగురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా గోడ కట్టారని, దానిని తొలగించి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీని నిర్మించాలని శ్రావణబోయిన మల్లీశ్వరి చేసిన దరఖాస్తును పాల్వంచ మున్సిపల్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు.
ఉద్యోగులు సమయపాలన పాటించాలి
కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలని, లేకుంటే చర్య తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ఉదయం 10.30 – 10.45 వరకు విధులకు రాకుంటే గైర్హాజరుగా పరిగణిస్తామని, అవసరమైతే షోకాజ్ నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.
ఏఐతో బోధన సులభం..
బూర్గంపాడు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో విద్యాబోధన సులభమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అంజనాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏఐ విద్యాబోధనను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు, సులువుగా అర్థమయ్యేందుకు ఏఐ సహకరిస్తుందన్నారు. విద్యార్థులు ఏఐ క్లాసులను వినియోగించుకోవాలన్నారు. బూర్గంపాడు మండలంలో అంజనాపురం, మోరంపల్లిబంజర, బూర్గంపాడు–2, నాగినేనిప్రోలు, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ తరగతులను ప్రారంభించామని తెలిపారు. అనంతరం బూర్గంపాడు గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా అని ఆరా తీశారు. పాఠశాలలో అవసరమైన వసతులపై నివేదిక ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎంపీ బంజరలో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ యదుసింహరాజు, డీటీ రామ్‌నరేష్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment