బొగ్గు ఉత్పత్తికి అంతరాయం | - | Sakshi
Sakshi News home page

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

Published Sat, Apr 5 2025 12:20 AM | Last Updated on Sat, Apr 5 2025 12:20 AM

బొగ్గు ఉత్పత్తికి  అంతరాయం

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఏరియాలోని జేవీఆర్‌ఓసీ–2లో 10 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 3 వేల టన్నులతోపాటు కిష్టారం ఓసీలో 1500 క్యూబిక్‌ మీటర్ల ఓబీ, జేవీఆర్‌ఓసీ–2లో 50 వేల క్యూబిక్‌ మీటర్ల ఓబీకి అంతరాయం వాటిల్లింది.

ఎన్డీ జిల్లా కార్యదర్శి రమేశ్‌ విడుదల

ఇల్లెందు: సీపీఐ (ఎంఎల్‌) ఎన్డీ జిల్లా కార్యదర్శి, ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం బాబు అలియాస్‌ రమేశ్‌ శుక్రవారం ఖమ్మం జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు. గత నవంబర్‌ 28న ఆయన్ను ఇంటి వద్ద గుండాల పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. 20 ఏళ్లుగా ఉద్యమంలో, ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న రమేశ్‌ పలు దఫాలు జైలు జీవితం గడిపారు. లింగన్న ఎన్‌కౌంటర్‌ తర్వాత ఎన్డీ దళాలు క్రమక్రమంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయినా రమేశ్‌ మాత్రం అజ్ఞాతం వీడలేదు. అనారోగ్యంతో ఇంటికి చేరిన ఆయన పోలీసులకు చిక్కి నాలుగు నెలల నాలుగు రోజులు ఖమ్మం జైలులో గడిపారు. ఆయనపై ఇల్లెందు, బోడు, ఆళ్లపల్లి, గుండాల పోలీస్‌ స్టేషన్లలో ఆరు కేసులున్నాయి. ఎన్డీ నేతలు పొడుగు నర్సింహారావు, టి.నాగేశ్వరరావు స్వాగతం పలికారు.

వచ్చే నెల 19న

ఆత్మలింగేశ్వరాలయం ప్రతిష్ఠాపన

పాల్వంచ: పాల్వంచలోని చింతలచెర్వు వద్ద ఉన్న ప్రాచీన ప్రముఖ శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో మే 15 నుంచి 19వ తేదీ వరకు జీర్ణోధరణ పూర్వక ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు కార్యక్రమాల కరపత్రాలను శుక్రవారం విడుదలచేసిన ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు మాట్లాడారు. కాకతీయుల పరిపాలనలో ప్రతాపరుద్రుడి హయాంలో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ప్రతిష్ఠాపనకు కాకతీయ వారసుడు కమల్‌చంద్‌బంజ్‌దేవ్‌, పాల్వంచ సంస్థానాదీళుల వారసులు కృష్ణకుమార్‌ అప్పారావు అశ్వరాయ, మధుకుమార్‌ అప్పారావు అశ్వరాయ, అశ్వారావుపేట పరగణాధిపతుల వారసులు దామెర కుమారమురళి మహిపాల్‌ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. వచ్చేనెల 19వ తేదీన ఆదిశంకరాచర్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వరులు విద్యారణ్య భారతీ మహాస్వామి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభికం ఉంటాయని తెలిపారు. సమావేశంలో యల్లావులు కోటేశ్వరరావు, యల్లావుల వెంకన్న, వల్లపు యాకయ్య, రమణ, ఫణి, సాంబయ్య, అచ్యుత్‌ రావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామనవమికి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో ఆదివారం జరగనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ అధికారుల నుంచి భద్రాచలం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్‌ శనివారం సాయంత్రమే భద్రాచలం చేరుకునే అవకాశముందని, ఆదివారం ఉదయం కల్యాణాన్ని తిలకించాక తిరిగి వెళ్తారని సమాచారం. అంతేకాక పలువురు కేంద్ర మంత్రులు, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌.నాయుడు కూడా భద్రాచలం రానున్నట్లు తెలిసింది.

డ్రెయినేజీలో

పడి వ్యక్తి మృతి

పాల్వంచ: మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందడంతో పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన కొంపెల్లి వెంకటేశ్వర్లు (55) గురువారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో డ్రెయినేజీలో పడ్డాడు. వర్షం వల్ల డ్రెయినేజీ పొంగింది. వెంకటేశ్వర్లు బయటకు రాలేక మృతి చెందాడు. స్థానికులు కొంత సేపటి తర్వాత గుర్తించి, బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య స్వరూప శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సుమన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలున్నారు.

మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్లే మృతి

నవభారత్‌ వైన్స్‌ సమీపంలో డ్రెయినేజీ ఓపెన్‌ చేసి ఉండటంతో రాత్రి వేళ కనిపించక వెంకటేశ్వర్లు అందులో పడి మృతి చెందాడని, ఇది మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీ శుభ్రం చేసేందుకు పైకప్పును సిబ్బంది పగులగొట్టారని, అనంతరం అలానే వదిలేశారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement