ఇల్లెందురూరల్: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కుమారుడు ఊకే ప్రభాకర్ (45) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. అనారోగ్యంతో గతేడాది నవంబర్ 24న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి చెందారు. అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రభాకర్‌ను మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ బుధవారం గుండె సంబంధిత శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేక గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రభాకర్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
దమ్మపేట: విద్యుత్ వైర్లు తెగిపడటంతో రెండు గెదేలు, దూడ మృతి చెందిన ఘటన మండలంలోని రంగువారిగూడెం గ్రామ పంచాయతీ వెంకటరాజాపురం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని వెంకటరాజాపురం గ్రామానికి చెందిన దుంగల నాగమణి తన రెండు గెదేలు, దూడను గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో మేత కోసం తోలుకుని వెళ్లింది. గెదేలు మేస్తుండగా అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ వైరు తెగిపోయి గెదేలపై పడింది. దీంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి ఆదుకోవాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతారాంపురం శివారు వాగు నుంచి ఇసుక తోలుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, అనుమతిపత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్లర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పీవీకే–5 గనిలో ప్రమాదం
కాంట్రాక్ట్ కార్మికుడికి గాయాలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పద్మావతి ఖనిలో కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్‌కు గాయమైంది. ఇతను గెయిన్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తున్నాడు. గురువారం గనిలో సీఎంఆర్ వద్ద పనిచేస్తున్న క్రమంలో పైనుంచి బొగ్గుపెళ్ల పడి తలకు గాయమైంది. వెంటనే కార్మికుడిని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా సదరు కంపెనీ నిర్వాహకులు ప్రమాద విషయాన్ని బయటికి పొక్కకుండా ప్రయత్నించారు. గాయపడిన కార్మికుడిని ఎవరూ కలిసే వీలులేకుండా అడ్డుకుని గెస్ట్ హౌస్‌లో ఉంచారు.
మందుపాతరలు నిర్వీర్యం
చర్ల: చర్ల మండల శివారు రాంపురం అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన నాలుగు శక్తిమంతమైన మందుపాతరలను గురువారం కోబ్రా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని బీమారం క్యాంపునకు చెందిన కోబ్రా 204 బెటాలియన్‌కు చెందిన పోలీసు బలగాలు సమీప అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బీమారానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మందుపాతరలను గుర్తించారు. బాంబు డిస్పోజబుల్ బృందం వచ్చి ప్రెజర్‌బాంబు, మూడు బీరు బాటిల్ బాంబులుగా నిర్ధారించి, అక్కడే నిర్వీర్యం చేశారు. దీంతో పోలీసులకు పెనుప్రమాదం తప్పిందని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి