న్యూఢిల్లీ: ప్రాపర్టీ డెవలపర్ల వద్ద అమ్ముడుపోని ఇళ్లు భారీగా ఉండిపోయాయి. సెప్టెంబర్ త్రైమాసికం చివరికి హైదరాబాద్ మార్కెట్లో 99,090 యూనిట్లు మిగిలిపోయాయి. ఇవి అమ్ముడుపోవడానికి 41 నెలల సమయం తీసుకుంటుందని అంచనా.
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇలా విక్రయం కాకుండా ఉండిపోయిన ఇళ్ల యూనిట్లు 7.85 లక్షలుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ సంస్థ వెల్లడించింది.
ప్రస్తుత అమ్మకాల తీరు ఆధారంగా చూస్తే, మిగిలిపోయిన 7.85 లక్షల ఇళ్లు విక్రయం కావడానికి 32 నెలలు పట్టొచ్చని పేర్కొంది. ‘‘ఢిల్లీ–ఎన్‌సీఆర్ మార్కెట్లో 1,00,770 ఇళ్ల యూనిట్లు ఉండిపోయాయి.
ఇక్కడ ఆమ్రపాలి, జైపీ ఇన్‌ఫ్రాటెక్, యూనిటెక్ వంటి పెద్ద రియల్టీ సంస్థలు దివాలా తీయడంతో మిగిలిన ఇళ్ల యూనిట్లు పూర్తిగా అమ్ముడుపోవడానికి 62 నెలల వరకు సమయం పట్టొచ్చు’’అని ప్రాప్‌టైగర్ తెలిపింది.
ఈ సంస్థ నివేదిక ప్రకారం 2022 జూన్ నాటికి మిగిలిపోయిన ఇళ్లు 7,63,650గా ఉంటే, సెప్టెంబర్ చివరికి 7,85,260 యూనిట్లకు నిల్వలు పెరిగాయి. ఇందులో 21 శాతం ఇళ్లు ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి.
పట్టణాల వారీగా..
►ఈ ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ కాలంలో 49 శాతం పెరిగి 83,220 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 55,910 యూనిట్లుగా ఉండడం గమనించాలి.
►కోల్‌కతాలో అతి తక్కువగా ఇళ్ల నిల్వలు ఉన్నాయి. ఇక్కడ 22,530 ఇళ్ల యూనిట్లు మిగిలిపోగా, వీటి విక్రయానికి 24 నెలల సమయం పట్టొచ్చని ప్రాప్ టైగర్ అంచనా వేసింది.
► అహ్మదాబాద్‌లో 65,160 యూనిట్లు ఉండగా, ఇవి పూర్తిగా అమ్ముడుపోవడానికి 30 నెలల సమయం తీసుకోవచ్చు.
►బెంగళూరులో 77,260 యూనిట్లు మిగిలి ఉన్నాయి. వీటి అమ్మకానికి 28 నెలలు తీసుకోవచ్చు.
►చెన్నైలో 32,810 యూనిట్లుగా ఉంటే, వీటి అమ్మకానికి 27 నెలల సమయం తీసుకోవచ్చని అంచనా.
► ఇక ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 2,72,960 యూనిట్ల ఇళ్లు మిగిలిపోయాయి. వీటి అమ్మకానికి 33 నెలల సమయం పడుతుందని అంచనా.
► పుణెలో ఉన్న 1,15,310 మిగులు ఇళ్ల అమ్మకానికి 22 నెలలు సమయం తీసుకుంటుంది.
►అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ కాలం జూన్–జూలైలో 44 నెలలుగా ఉంటే, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 32 నెలలకు తగ్గడాన్ని ప్రాప్‌టైగర్ ప్రధానంగా ప్రస్తావించింది. హౌసింగ్ డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment