సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల దృష్ట్యా వ్యాపారాలపై విధించిన ఆంక్షలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాదు నటులు, ప్రొఫెషనల్ క్రికెటర్లు, రాజకీయ నాయకులకు లేని ఆంక్షలు వ్యాపారాలకు ఎందుకుంటూ మండిపడ్డారు. అసలు 'ఎసెన్షియల్’ అర్థం ఏమిటి? అంటూ మహారాష్ట్ర అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రొఫెషనల్ 'నటులు' వారి వారి సినిమాల షూటింగ్ కొనసాగించుకోవచ్చు. ప్రొఫెషనల్ 'క్రికెటర్లు' అర్థరాత్రి వరకు ఆడుకోవచ్చు. ప్రొఫెషనల్ 'రాజకీయ నాయకులు' భారీగా గుమిగూడిన జనాలతో ర్యాలీలను కొనసాగించవచ్చు. కానీ వ్యాపారం లేదా పని ఎసెన్షియల్ కాదా అని అన్మోల్ అంబానీ ప్రశ్నించారు. ఎవరి పని వారికి అత్యవసరమే అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
మరోవైపు కరోనా కేసుల పెరుగుదల మధ్య మహారాష్ట్రలో వ్యాక్సిన్లు అయి పోతున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇక మూడు రోజులకు సరిపడా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, రాబోయే మూడు రోజులకు ఇవి సరిపోతాయని అన్నారు.
కాగా దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మరింత తీవ్రంగా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. సినిమా హాళ్ళు, పార్కులు, మ్యూజియంలు , రెస్టారెంట్లు అన్ని మత ప్రదేశాలను మూసి ఉంచాలని, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని, రాత్రిపూట సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూ ఉంటుందని ఆదేశించింది. లాక్‌డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తామని మంత్రివర్గం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతంలో (శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు) పూర్తి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
What does essential even mean? EACH INDIVIDUALS WORK IS ESSENTIAL TO THEM. #scamdemic
— Anmol A Ambani (@anmol_ambani) April 5, 2021
Comments
Please login to add a commentAdd a comment