న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది.
చైనాలోని జెంగ్‌జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్‌మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్)
చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్‌కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్‌జౌ యాపిల్‌కు ఎంతో కీలకమైన ప్లాంట్‌లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్‌ఫోర్స్ గత వారం జెంగ్‌జౌ ప్లాంట్‌లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్‌మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం.
మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్‌జౌ ప్లాంట్‌లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment