Astrology: గ్రహాలేం చెబుతున్నాయ్‌.. | Astrology: Online astrology platforms see a boom | Sakshi
Sakshi News home page

Astrology: గ్రహాలేం చెబుతున్నాయ్‌..

Published Sat, Feb 24 2024 4:26 AM | Last Updated on Sat, Feb 24 2024 4:26 AM

Astrology: Online astrology platforms see a boom - Sakshi

న్యూఢిల్లీ: సర్వత్రా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయా, ఇంక్రిమెంట్లు పడతాయా వంటి అనేకానేక సందేహాలు చాలామంది ఉద్యోగులను వెంటాడుతున్నాయి. తమ భవిష్యత్తు గురించి గ్రహాలేం చెబుతున్నాయో తెలుసుకోవాలనే ఆరాటం కొద్దీ ఆన్‌లైన్‌ జ్యోతిష్యం పోర్టల్స్‌ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిలో యువ ఉద్యోగులే కాకుండా ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం.

ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, కెరియర్‌లో పురోగతి, ఉద్యోగంలో మార్పులు వంటి అంశాలపై ఉద్యోగులు ఆరాటపడుతుండగా, స్టార్టప్‌ వ్యవస్థాపకులు తమ నిధుల సమీకరణ యత్నాలు సక్రమంగా సాగుతాయా లేదా, ఇతర వ్యవస్థాపకులతో సంబంధాలు బాగుంటాయా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ ఆ్రస్టాలజీ పోర్టల్స్‌కి డిమాండ్‌ పెరుగుతోంది.

కెరియర్, బిజినెస్‌ గురించి తెలుసుకునేందుకు డిజిటల్‌ ఆ్రస్టాలజీ ప్లాట్‌ఫాం గణేషాస్పీక్స్‌డాట్‌కామ్‌కి యువ ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల నుంచి వచ్చే కన్సల్టేషన్ల అభ్యర్ధనలు పది రెట్లు పెరిగాయి. వారిలో చాలా మంది 23–35 ఏళ్ల మధ్య వారే కావడం విశేషం. ఇక ఆస్ట్రోయోగి ప్లాట్‌ఫాంపై యూజర్ల సంఖ్య .. కోవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే 10 రెట్లు పెరిగింది. ఆస్ట్రోటాక్, ఆస్ట్రోయోగి వంటి ప్లాట్‌ఫాంలు అందించే మొత్తం కన్సల్టేషన్‌లలో సుమారు 30 శాతం కన్సల్టేషన్లు .. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఉద్యోగాల్లో కోతల భయాలు మొదలైన వాటి గురించే ఉంటున్నాయి.   

రూ. 10 నుంచి కన్సల్టేషన్‌..
జ్యోతిష్యుల అనుభవాన్ని బట్టి కన్సల్టేషన్‌కు వసూలు చేసే చార్జీలు ఉంటున్నాయి. నిమిషానికి రూ. 10 నుంచి మొదలుపెడితే రూ. 200 వరకు కూడా ఇవి ఉంటున్నాయి. జ్యోతిష్యుల్లో పక్కాగా జ్యోతిష్యం నేర్చుకున్నవారే కాకుండా ఇంజనీర్లు, ఎంటెక్, సీఏలు చేసిన వారు కూడా ఉంటున్నారు. సోషల్‌ మీడియా వినియోగం అత్యధికంగా ఉండే నగరాల్లోని మొత్తం ఆన్‌లైన్‌ ఆ్రస్టాలజీ యూజర్లలో 60 శాతం వాటా జనరేషన్‌ జెడ్‌ యువతదే ఉండటం ప్రస్తావించతగ్గ అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వ్యాపారాల విషయంలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో చిన్న పట్టణాలు మొదలుకుని మెట్రో నగరాల వరకు అన్ని చోట్లా యువ యూజర్ల నుంచి దాదాపు ఒకే తరహా సందేహాలకు కన్సల్టేషన్‌ అభ్యర్ధనలు వస్తున్నాయని పేర్కొన్నాయి. ఆస్ట్రో యూజర్లలో ఎక్కువ శాతం మంది ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, జైపూర్, చండీగఢ్, లూధియానా వంటి పెద్ద నగరాల నుంచి ఉంటున్నట్లు వివరించాయి.

వ్యాపారం జోరు..
పెరుగుతున్న యూజర్ల సంఖ్యకు అనుగుణంగా ఆస్ట్రో పోర్టల్స్‌ ఆదాయాలు కూడా జోరుగా ఉంటున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రోటాక్‌ ఆదాయం రూ. 65 కోట్లుగా ఉండగా 2023 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 282 కోట్లకు పెరిగింది. లాభాలు రూ. 11.2 కోట్ల నుంచి రూ. 27 కోట్లకు చేరాయి. యూజర్ల సంఖ్య 25 లక్షల నుంచి ఇప్పటివరకు 1.9 కోట్లకు ఎగిసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 630 కోట్లకు, లాభం రూ. 130 కోట్లకు చేరగలదని ఆస్ట్రోటాక్‌ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరించాలనే యోచనలో కంపెనీ ఉంది. ఇందులో భాగంగా ఇతర సంస్థలను కొనుగోలు చేయడం, కొత్త విభాగాలను ప్రారంభించడం, సీనియర్ల హోదాలో నియామకాలు చేపట్టడం మొదలైన వాటిపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, గణేషాస్పీక్స్‌ పోర్టల్‌ను తీసుకుంటే 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 58 శాతం పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement