న్యూఢిల్లీ: టెలికం రంగంలో ప్రకటించిన సంస్కరణలను కేంద్రం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తులో నిర్వహించబోయే స్పెక్ట్రం వేలం నిబంధనలను సడలిస్తూ టెలికం విభాగం (డాట్) సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం స్పెక్ట్రం వార్షిక చెల్లింపుల పూచీకత్తుకు సంబంధించి టెల్కోలు ఒక ఏడాది వాయిదా మొత్తానికి సరిపడేంత .. ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ (ఎఫ్‌బీజీ) ఇవ్వాలన్న నిబంధనను తొలగించింది. అలాగే సర్వీసుల విస్తరణ విషయంలో పనితీరు బ్యాంక్ గ్యారంటీ (పీబీజీ) సమర్పించాలన్న షరతును కూడా ఎత్తివేసింది. వేలంలో పాల్గొనే సంస్థలకు తగినంత ఆర్థిక స్థోమత ఉండేలా అర్హతా ప్రమాణాలను కూడా తగు రీతిలో సవరించనున్నట్లు టెలికం శాఖ పేర్కొంది. భవిష్యత్తులో స్పెక్ట్రంను 30 ఏళ్ల వ్యవధికి కేటాయించనున్నట్లు వివరించింది. గత విడతల్లో విక్రయించిన స్పెక్ట్రం కాలపరిమితిలో (20 ఏళ్లు) ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. 30 ఏళ్ల కాలపరిమితితో స్పెక్ట్రంను కేటాయించే విషయంలో ఆపరేటర్లు ముందుగా జరపాల్సిన చెల్లింపులు, ఇందుకోసం ఇవ్వతగిన మారటోరియం వ్యవధి, వాయిదాలు మొదలైన అంశాలపై తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను కోరినట్లు డాట్ పేర్కొంది. మరోవైపు, టెల్కోలు కనీసం 10 ఏళ్ల వ్యవధి తర్వాత తమ స్పెక్ట్రంను వాపసు చేయవచ్చని డాట్ తెలిపింది. అయితే, దీని గురించి ఏడాది ముందే తెలియజేయాల్సి ఉంటుందని, సరెండర్ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది.
సంస్కరణలతో టెల్కోలపై తగ్గనున్న భారం: సీవోఏఐ డీజీ కొచర్
టెలికం రంగంలో కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచర్ తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే స్పెక్ట్రం వేలానికి సంబంధించి ఎఫ్‌బీజీ, పీబీజీ నిబంధనలను తొలగించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో ఆపరేటర్లపై ఆర్థిక భారం తగ్గగలదని కొచర్ పేర్కొన్నారు. టెలికం రంగంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడానికి ఇవి తోడ్పడగలవని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment