న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ప్రాజెక్టులకు (గ్రీన్ ఫైనాన్స్) బ్యాంకుల రుణాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ దినేష్ ఖారా పిలుపునిచ్చారు.తద్వారా సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు.
‘‘గ్రీన్ ఫైనాన్స్ అన్న పదానికి ముందు తగిన నిర్వచనం ఇవ్వాలి. ఈ విభాగానికి సంబంధించి పటిష్ట నియంత్రణను అలాగే ఈ తరహా రంగాలకు మరింత ఫైనాన్స్ రావడానికి ఈ అంశం దోహదపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి’’ అని ఎస్‌బీఐ చైర్మన్ అన్నారు. ఈఎస్‌జీ (ఇన్విరాన్‌మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్) ఇండియా లీడర్‌షిప్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖారా చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦గ్రీన్ ఫైనాన్స్ విషయంలో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలను తొలుత పరిశీలించాలి. అలాగే ఇందుకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాల విషయంలో మూలసూత్రాలను అభివృద్ధి చేయాలి. ఆ రంగంలో వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలి. తద్వారా ఒక ‘‘గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం’’ ఆవిష్కరణ జరగాలి.
♦బ్యాంకులు గ్రీన్ ప్రాజెక్ట్‌లకు తగిన క్రెడిట్ అందించలేకపోతే అలాగే ఆయా ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోలో ఇబ్బందులను కనిపెట్టలేకపోతే ఈ విభాగంలో రిటర్న్స్ తీసుకోవాలనుకునే డిపాజిటర్లు, వాటాదారులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదముంటుంది.
♦ పర్యావరణం, తత్సంబంధ సామాజిక అంశాలు, నిర్వహణ విషయాల్లో ఎస్‌బీఐ చొరవను పరిశీలిస్తే, 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంక్ తన వంతు ప్రయత్నం చేయనుంది. ఈ దిశలో పలు లక్ష్యాల సాధనకు కృషి చేయనుంది.
♦ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మాత్రమే బ్యాంక్ పరిమితం కాదు. చెట్ల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, క్యాంపస్‌లో సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం తదితర చర్యల్లో పురోగతికి బ్యాంక్ తగిన పాత్ర పోషిస్తుంది. – ప్రస్తుతం వ్యాపార రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతోంది. ఈ పరిస్థితుల్లో వాతావరణానికి జరిగే నష్టం అవకాశాలనూ బ్యాంక్ గుర్తించే పనిలో ఉంది.
♦ పర్యావరణ పరిరక్షణ సానుకూల ప్రాజెక్టుల విషయంలో రుణాల పెంపునకు బ్యాంక్ తగిన కృషి చేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రుణగ్రహీతలకు బ్యాంక్ రుణ సదుపాయాలను సులభతరంగా అందిస్తోంది. రూ.50 కోట్లు దాటిన రుణాల విషయంలో ఈఎస్‌జీ విషయంలో ఆయా పారిశ్రామికవేత్తల కృషిని బట్టి వారికి ఒక స్కోర్‌ను అందించడం జరుగుతోంది.
♦ పర్యావరణ అనుకూల సాంకేతికతలకు ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి దోహదపడే ప్రొడక్టులను, సేవలను రూపకల్పన చేయడంలో గత కొన్నేళ్లుగా ఎస్‌బీఐ తగిన ప్రయత్నం చేస్తోంది.
♦2018–19 నుంచి 800 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ బాండ్లు, గ్రీన్ లోన్ బాండ్లను ఎస్‌బీఐ జారీ చేసింది. తద్వారా సమీకరించిన నిధులను పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకే వినియోగిస్తోంది.
♦కాగా, అక్యూట్ గ్రూప్‌నకు చెందిన ఈఎస్‌జీ రేటింగ్ ఏజెన్సీ– ఈఎస్‌జీరిస్క్.ఏఐ55 ఈ సందర్భంగా పరిశ్రమలోని టాప్–500 టాప్ –500 లిస్టెడ్ కంపెనీల నుండి 21 విజేతలను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment