న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలకు కూడా ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చీఫ్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ఈ విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భారత్ అంతర్జాతీయ స్థాయిలోనూ పురోగమిస్తోందని ఆయన చెప్పారు. అటు పసిడి హాల్‌మార్కింగ్‌కు నిర్దేశించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని తివారీ స్పష్టం చేశారు.
పాత నిల్వలను విక్రయించుకునేందుకు జ్యుయలర్లకు రెండేళ్ల పైగా గడువును ఇచ్చామని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేసేలా తప్పనిసరిగా 6 అంకెల హాల్‌మార్క్ విశిష్ట గుర్తింపు సంఖ్యతోనే (హెచ్‌యూఐడీ) విక్రయించాలన్న నిబంధనలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకే తాము ప్రమాణాలను రూపొందిస్తున్నామని తివారీ వివరించారు. ఇతర దేశాలతో కూడా వాణిజ్యం జరిపేందుకు వీలుగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment