ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కోపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2011–13 మధ్య కాలంలో బొగ్గు తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందడంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినట్లు తెలిపింది. తీవ్ర కాలుష్యం ఉన్న ఒడిశా జార్సుగూడ ప్రాంతంలోని తలబిరా–1 గనిలో హిందాల్కో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని విచారణ అనంతరం సీబీఐ పేర్కొంది.
తలబిరా-1 గనిలో మైనింగ్‌ను అనుమతించడంలో నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) కార్యదర్శి హోదాలో కంపెనీకి అనుకూలంగా వ్యవహరించిన అప్పటి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా ఉన్న టి.చాందిని పేరును సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ 2011–13 మధ్య బొగ్గు తవ్వకాలకు తప్పనిసరి పర్యావరణ అనుమతులు పొందేందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు భారీగా లంచాలు చెల్లించిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2016లో ప్రాథమిక విచారణ జరిపింది. పరిమితికి మించి 30 లక్షల టన్నుల బొగ్గును అదనంగా వెలికితీశారని వెల్లడించింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120–బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం హిందాల్కో, అప్పటి డైరెక్టర్ చాందినిలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ఇదిలాఉండగా, ఈ విషయంపై హిందాల్కో స్పందించింది. ‘ఇది 2014–15కి సంబంధించిన పాత విషయం. ప్రభుత్వం చేపట్టిన గనుల కేటాయింపుల రద్దు ప్రక్రియలో భాగంగా వాటిని ఎప్పుడో ప్రభుత్వం తీసుకుంది. 100కు పైగా గనుల కేటాయింపులు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే’ అని సంస్థ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment