ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి ఆ తర్వాత అనంతర పరిణామాలతో ఇన్వెస్టర్ల ఆలోచణ ధోరణిలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రష్యా దాడులు, అమెరికా దాని మిత్ర పక్ష దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల కారణంగా బడా వ్యాపారాల భవిష్యత్తు డోలయమానంలో పడగా, వాటి లాభాల మార్జిన్లకు కోతలు పడుతున్నాయి. అయితే యుద్ధం తెచ్చిన ఉద్రిక్తల కారణంగా రక్షణ రంగంలో వ్యాపారం చేస్తున్న కంపెనీల షేర్ల ధరలు రయ్‌రయ్‌మంటున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి మూడు వారాలు దాటినా నేటికి ఫలితం తేలలేదు. పైగా రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఓ పక్క. అమెరికా దాని మిత్ర పక్షలు ఒక పక్క అనే పరిస్థితి నెలకొంది. ఇరుపక్షాలు మూడో ప్రపంచ యుద్దం ముంగిట సంయమనం పాటిస్తున్నాయి. కానీ యుద్ధ భయాలు మాత్రం తొలగిపోలేదు. ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాలకు వేదికగా నిలిచిన యూరప్ దేశాలు తమ రక్షణ విషయంలో ఆందోళన చెందుతున్నాయి.
నాటోను నమ్మలేం
మరోవైపు కీలక సమయంలో నాటో దేశాలు చేతులెత్తాశాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను పునరాలోచనలో పడేసింది. దేశ రక్షణ విషయంలో ఔట్‌సోర్సింగ్ నమ్మదగిన వ్యవహారం కాదనేట్టుగా పరిస్థితులు మారాయి. చాలా దేశాలు రక్షణ బడ్జెట్ పెంచే యోచనలో ఉన్నాయి.
అస్థిరంగా ఆయిల్
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తదనంతర పరిణామాల్లో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలు చవి చూశాయి. ఇన్వెస్టర్లు వివిధ కంపెనీల్లో తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుని ఆయిల్, బంగారంలలో పెట్టుబడులు పెట్టారు. కానీ ముడి చమురు ధరలు మరింర అస్థిరంగా మారాయి. కేవలం పది రోజలు వ్యవధిలోనే బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్ల వరకు హెచ్చు తగ్గులు చవిచూసింది. బంగారానిది ఇదే బాట. దీంతో నమ్మకమైన పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు రక్షణ రంగంలో ఉన్న కంపెనీల వైపుకు చూస్తున్నారు. ఫలితగా డిఫెన్స్ సెక్టార్‌లో ఉన్న కంపెనీల స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి.
డిఫెన్స్‌పైనే గురి
- డిఫెన్స్ సెక్టార్‌కి అవసరమైన ముడి పరికరాలు తయారు చేసే భారత డైనమిక్స్ షేరు ధర ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభంలో రూ. 529లు ఉండగా మధ్యాహ్నాం దాదాపు 7 శాతం వృద్ధితో రూ.36లు లాభపడి 558.65కి చేరుకుంది.
- మన దేశంలో డిఫెన్స్‌లో ఎంతో కీలకమైన హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ షేరు ధర ఈ రోజు ఉదయం రూ. 1394ల వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 4.13 శాతంత వృద్ధితో రూ.1433 దగ్గర ట్రేడవుతోంది.
- భారత్ ఎలక్ట్రానిక్ షేరు ఒక శాతం వృద్ది కనబరిచి రూ.207.80 దగ్గర ట్రేడవుతోంది
- భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) షేర్లు రూ.25ల లాభంతో 1.65 శాతం వృద్ధి కనబరిచి రూ.1542 దగ్గర ట్రేడవుతోంది.
- కీలకమైన సెమికండక్టర్లు తయారు చేసే ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్ లిమిటెడ్ షేరు 4.52 శాతం వృద్ధితో రూ.226.55 దగ్గర ట్రేడవుతోంది. జెన్ టెక్నాలజీస్ షేర్లు సైతం లాభాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment