భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్‌గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు.
డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు.
నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్‌లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment