
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల విభాగం వచ్చే పదేళ్లలో ఏటా సుమారు 40% మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈవో మహేశ్ బాబు తెలిపారు. గతేడాది 1,200 ఎలక్ట్రిక్ బస్సులు రిజిస్టర్ కాగా, ఈసారి 2,000 దాటేయొచ్చని చెప్పారు. వచ్చే ఏడాది ఇది 6,000కు చేరవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సు తయారీ వ్యయం సగటున రూ. 1.5 కోట్ల స్థాయిలో ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సానుకూల పాలసీలు ఇందుకు తోడ్పడగలవని ఆయన చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకోవడంపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని మహేష్ బాబు చెప్పారు. తమ సంస్థ విషయానికొస్తే.. ఇప్పటికే 500 పైచిలుకు బస్సులు సరఫరా చేశామని, వచ్చే 12–18 నెలల్లో సుమారు 2,600 బస్సులు అందించనున్నామన్నారు. తెలంగాణకు దాదాపు 1,000 బస్సులు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేస్తున్నది తమ కంపెనీ మాత్రమేనని, హెచ్‌ఎండీఏకి 6 అందిస్తున్నామని తెలిపారు.