
ముంబై: భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) వరుసగా నాలుగో వారం కూడా పురోగమించాయి. డిసెంబర్ 2వ తేదీతో ముగిసిన వారంలో 11 బిలియన్ డాలర్లు పెరిగి 561.162 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
అక్టోబర్ 2021న దేశ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలహీనత, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ పరిమిత జోక్యం, తదితర కారణాల నేపథ్యంలో క్రమంగా 520 బిలియన్ డాలర్ల వరకూ దిగివచ్చాయి. ఒక దశలో వరుసగా ఎనిమిది నెలలూ దిగువబాటన పయనించాయి. కొంత ఒడిదుడుకులతో డిసెంబర్ 2తో గడచిన నెలరోజుల్లో ఫారెక్స్ పెరుగుదల ధోరణి ప్రారంభమైంది. తాజా గణాంకాలు విభాగాల వారీగా చూస్తే..
►డాలర్ల రూపంలో పేర్కొనే వివిధ దేశాల కరెన్సీ అసెట్స్ (ఎఫ్‌సీఏ) 9.694 బిలియన్ డాలర్లు పెరిగి 496.984 బిలియన్ డాలర్లకు చేరాయి.
►పసిడి నిల్వలు 1.086 బిలియన్ డాలర్లు పెరిగి 41.025 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
►అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) 164 మిలియన్ డాలర్లు తగి 18.04 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
►ఇక ఐఎంఎఫ్ వద్ద రిజర్వ్ పరిస్థితి 75 మిలియన్ డాలర్లు తగ్గి 5.108 బిలియన్ డాలర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment