భారత విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గతి శక్తి విశ్వవిద్యాలయం (జీఎస్వీ), ఎయిర్‌బస్ పరస్పరం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సెప్టెంబర్ 2023లో జరిగిన ఎంఓయూను అనుసరించి ఎయిర్‌బస్ ఎండీ రెమి మెయిలార్డ్, జీఎస్వీ వైస్ ఛాన్స్‌లర్ మనోజ్ చౌదరి మధ్య న్యూదిల్లీలోని రైల్ భవన్‌లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.
మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం..భారత్‌లోని విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు జీఎస్వీ, ఎయిర్‌బస్ మద్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విమాన రంగంలో రాణించాలనుకునే వారికి ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తారు. మొత్తం ప్రోగ్రామ్ వ్యవధిలో 40 మందికి పూర్తి స్కాలర్‌షిప్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్.. అనే స్ఫూర్తితో కేంద్రం విమానయానం, హైవేలు, రైల్వేలు, రోడ్డు రవాణాను అభివృద్ధి చేస్తోంది. దానికి అందరి సహకారం అవసరం. అన్ని రవాణా రంగాలను ఏకీకృతం చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని జీఎస్వీని ఏర్పాటు చేశాం. ఆయా రంగాల్లో తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా అందులో ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తున్నాం. ఇప్పటికే ఇందులో రైల్వే శిక్షణ ఇచ్చాం. విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అందులో విప్లవాత్మక మార్పులు రావాలి. కాబట్టి ప్రస్తుతం సివిల్ ఏవియేషన్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తర్వాత షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో శిక్షణ ఇస్తాం. ప్రస్తుతం జరిగే శిక్షణకు ఎయిర్‌బస్ సహకరిస్తుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!
ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి రెట్టింపయింది. ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులు టైర్ II, టైర్ III నగరాలకు విస్తరించాయి. ఈ రంగం పురోగతికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గతి శక్తి విశ్వవిద్యాలయానికి పూర్తిగా సహకరిస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో జయవర్మ సిన్హా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment