
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ సంస్థ ‘హౌసింగ్ డాట్ కామ్’ ఫిన్‌బాక్స్ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రూ.10 లక్షల వరకు రుణాలను తక్షణమే జారీ చేయనున్నట్టు తెలిపింది. రెంటల్ సెక్యూరిటీ డిపాజిట్, ఇంటి నవీకరణ, ఫరి్నచర్ కొనుగోలు అవసరాలను తీర్చేందుకు గాను కస్టమర్లకు రుణ సాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
మరింత సౌకర్యవంతంగా డిజిటల్ రూపంలో రుణాల మంజూరుకు గాను ఈ సేవను తన యాప్, వెబ్‌సైట్‌తో అనుసంధానించనున్నట్టు ప్రకటించింది. హౌసింగ్ ఎడ్జ్ ద్వారా కస్టమర్లు ఈ సేవను పొందొచ్చని తెలిపింది. సంక్లిష్టమైన రుణ దరఖాస్తులకు కాలం చెల్లిపోయిందని, మొత్తం రుణ దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే 3 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ఏర్పాటు చేసినట్టు హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. దరఖాస్తు ఆమోదం పొందిన 24 గంటల్లోనే రుణాన్ని మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇళ్లకు సంబంధించి అన్ని అవసరాలను అందించే ఏకీకృత వేదికగా అవతరించడమే తమ లక్ష్యమని తెలిపారు.