ప్రముఖ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టిసారించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది.
ఇంజిన్ డెవలప్‌మెంట్ సెంటర్ మూసివేత..!
హ్యుందాయ్ కొత్త అంతర్గత దహన ఇంజిన్‌లను అభివృద్ధి చేయడం ఆపివేస్తోందని కొరియన్ ఎకనామిక్ డైలీ పేర్కొంది. దీంతో డెవలప్‌మెంట్ సెంటర్‌లోని ఇంజిన్ డెవలప్‌మెంట్ విభాగం మూసివేసినట్లు తెలుస్తోంది. పవర్‌ట్రెయిన్ విభాగంను ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ డెవలప్‌మెంట్ టీమ్‌గా మార్చినట్లు కొరియన్ ఎకనామిక్ డైలీ వెల్లడించింది. వీటితో పాటుగా బ్యాటరీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా హ్యుందాయ్ అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త కేంద్రంలో బ్యాటరీ డిజైన్ బృందం, బ్యాటరీ పర్ఫార్మెన్స్ డెవలప్‌మెంట్ అనే రెండు బృందాలు పనిచేయనున్నాయి.
2030 నాటికి 30 శాతం వరకు..
2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల నుంచే ఆదాయాలను రాబట్టేందుకు హ్యుందాయ్ ప్రణాళికలను రచిస్తోంది. 2030 నాటికి మొత్తం అమ్మకాలలో 30 శాతం జీరో-ఎమిషన్ వాహనాల నుంచి పొందాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఈ వాహనాలు కనుమరుగు..!
హ్యుందాయ్ అనేక రకాలైన కంబ్యూషన్ ఇంజిన్ వాహనాలను తయారుచేస్తోంది. వాటిలో ముఖ్యంగా 1.1-లీటర్ల నుంచి 2.0-లీటర్ల సామర్ధ్యం కల్గిన ఇంజిన్స్ ఉన్నాయి. టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు, సీఎన్‌జీ, డిజీల్ ఇంజిన్ వాహనాలు ఉన్నాయి. కంపెనీ నిర్ణయం మేరకు ఈ వాహనాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోనుంది.
కొత్తగా ఆరు మోడల్స్‌తో..!
భారత ఆటోమొబైల్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై కసరత్తు ప్రారంభించినట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. 2028 నాటికి భారత్‌లో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి 4,000 కోట్లను కంపెనీ ఖర్చు చేయనుంది. ఇప్పటికే IONIQ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌లో తారసపడ్డాయి.
చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..!
Comments
Please login to add a commentAdd a comment