గాంధీనగర్: ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత ఇంధన అవసరాలు రెట్టింపవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం 3.5 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌లో అసాధారణ స్థాయిలో ఆర్థికాభివృద్ధి జరగనుందని ఆయన చెప్పారు. పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన, సమ్మిళిత అభివృద్ధిలో అంతర్జాతీయంగా దిగ్గజంగా ఎదిగేందుకు భారత్ మెరుగైన పరిష్కార మార్గాలను రపొందించగలదని అంబానీ ధీవ వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సామర్ధ్యాలు, నైపుణ్యాలపై నమ్మకం కలిగి ఉండాలని సూంచారు.
‘ధైర్యమనేది అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని కూడా దాటించగలిగే పడవలాంటిది. మీరు తప్పులు చేయొచ్చు. కానీ వాటి గురిం ఆందోళన చెందుతూ, వెనుకడుగు వేయకండి. తమ తప్పులను సరి చేసుకుని, లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేసేవారే విజయం సాధిస్తారు. పెద్ద కలలు కనండి. అవే మీ జీవితాన్ని ముందుకు నడిపించే చోదకాలవుతాయి. మీ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు నిబద్ధతతో వ్యవహరించండి. రిస్కులు తీసుకోండి. కానీ నిర్లక్ష్యం వహించకండి‘ అని అంబానీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment