
దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పెద్ద సంస్కరణను ప్రకటించింది. ఈమెయిల్‌ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్‌ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీలో కొత్తగా చేరేవారందరూ ఇకపై అప్లికేషన్ వివరాలను యాక్సెస్ చేయడానికి కంపెనీ అంతర్గత పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడాన్ని తప్పనిసరి చేసింది.
నియామక ప్రక్రియలో మోసాలను అరికట్టడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ చర్య ఫలితంగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో బేరసారాలు చేయడం కష్టతరమవుతుంది.
"ముఖ్యమైన నోటీసు-ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు మా కెరీర్ సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌లను ఈమెయిల్‌లకు పంపబోము" కంపెనీ పోర్టల్‌లో పేర్కొంది.
భారతీయ సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమలో ఫ్రెషర్‌ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులను అందుకుంది. వీటిలో 194,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment