రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్‌సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణంలో ప్యాసింజర్లు కోరుకున్న ఆహారాన్ని అందించేలా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’తో జత కట్టింది. దీంతో ప్రయాణికులు రైల్వే ప్రయాణంలో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్‌ను ముందే బుక్ చేసుకుంటే నిర్ధేశించిన రైల్వే స్టేషన్‌లో ఆహారాన్ని అందించనుంది.
ప్రస్తుతం, ఈ సౌకర్యం ఐదు స్టేషన్లకే పరిమితం చేసింది. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద ప్రస్తుతం ఢిల్లీతోపాటు ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో జొమాటో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక సర్వీసులు, ఆఫర్లను అందిస్తుంది. ప్రత్యేకించి నవరాత్రోత్సవాల్లో ఉపవాసం ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘థాలీ’ని అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.
ఐఆర్‌సీటీసీతో ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో జొమాటో షేర్ రూ.115 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి జొమాటో షేర్ రూ.113.20 వద్ద ముగిసింది. ఐఆర్‌సీటీసీ స్టాక్ రెండు శాతం నష్టాలతో రూ.700 వద్ద ట్రేడయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.48 శాతం నష్టంతో రూ.704 వద్ద స్థిర పడింది.
Comments
Please login to add a commentAdd a comment