కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం  | Layoffs on tech gaints like amazon google and Hp too | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం 

Published Thu, Nov 24 2022 8:30 AM | Last Updated on Thu, Nov 24 2022 8:56 AM

Layoffs on tech gaints like amazon google and Hp too - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ ప్రపంచంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా బాటలోనే గూగుల్, హెచ్‌పీ తదితర సంస్థలు కూడా సిబ్బందిని తగ్గించుకోవడమో లేక హైరింగ్‌ను నిలిపివేయడమో చేస్తున్నాయి. తాజాగా గూగుల్‌ 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది తొలినాళ్లలో ప్రకటించినట్లుగా పనితీరును మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన పనితీరు లేని ఉద్యోగులను వర్గీకరించాల్సిందిగా మేనేజర్లకు ఆదేశాలు వచ్చినట్లు వివరించాయి. దీని ప్రకారం సుమారు 6 శాతం మంది ఉద్యోగులను (దాదాపు 10,000 మంది) ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చని పేర్కొన్నాయి. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్‌ పీ150: ధర ఎంతంటే?)

గూగుల్‌ వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయంటూ సంస్థలో ఇన్వెస్టరయిన టీసీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించు కుంది. ఉద్యోగుల సంఖ్య.. వారిపై వ్యయాలు చాలా భారీ గా ఉంటున్నాయని, ఈ విషయంలో మేనేజ్‌మెంట్‌ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ యాజమాన్యానికి రాసిన లేఖలో టీసీఐ ఎండీ క్రిస్టోఫర్‌ హాన్‌ సూచించారు. ఆల్ఫాబెట్‌లో టీసీఐకి 6 బిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి. కోతల ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపై ఎలా ఉండవచ్చనేది తెలియరాలేదు. భారత్‌లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్న గూగుల్‌కు దేశీయంగా సుమారు 5 వేల  ఉద్యోగులున్నారు. ఇక్కడ 10 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు 2020లో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

హెచ్‌పీలో 6 వేల ఉద్యోగాలు కట్‌ .. 
మరోవైపు, పర్సనల్‌ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో వాటి తయారీ దిగ్గజం హెచ్‌పీ కూడా సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను 12 శాతం (6వేల వరకూ) తగ్గించుకోవాలని భావిస్తోంది. హెచ్‌పీలో సిబ్బంది సంఖ్య సుమారు 50,000 దాకా ఉండగా.. 4,000-6,000 వరకూ ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉంది. ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణ, ఇతరత్రా వ్యయాల కింద 1 బిలియన్‌ డాలర్ల వరకూ వెచ్చించాల్సి రావచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 2025 ఆర్థిక సంవత్సరం తర్వాత ఏటా 1.4 బిలియన్‌ డాలర్ల మేర ఆదా చేయొచ్చని భావిస్తోంది. మహమ్మారి కాలంలో ఒక్కసారిగా ఎగిసిన పీసీల (పర్సనల్‌ కంప్యూటర్స్‌) అమ్మకాలు ఆ తర్వాత గణనీయంగా తగ్గాయి. ద్రవ్యోల్బణం దశాబ్దాల రికార్డు స్థాయుల్లో తిరుగాడుతుండటంతో వినియోగదారులు .. కొనుగోళ్లపై వెచ్చించడాన్ని తగ్గించుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. దీంతో హెచ్‌పీ, డెల్‌ టెక్నాలజీస్‌ వంటి తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. మూడో క్వార్టర్‌లో డెల్‌ ఆదాయం 6 శాతం, నాలుగో త్రైమాసికంలో హెచ్‌పీ ఆదాయం 11 శాతం పడిపోయింది. 

మెటా ప్లాట్‌ఫామ్స్‌ (ఫేస్‌బుక్‌), అమెజాన్‌ ఇప్పటికే సుమారు 10,000 మంది చొప్పున ఉద్యోగుల తీసివేత ప్రక్రియ మొదలుపెట్టాయి. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో 7,500 మంది పైగా సిబ్బంది ఉండగా, కంపెనీ ఈ సంఖ్యను సగానికి పైగా తగ్గించుకుంది. సిస్కో సిస్టమ్స్‌ కూడా ఈ దిశగా ప్రణాళికలు ప్రకటించింది. అటు హార్డ్‌ డ్రైవ్‌ల తయారీ సంస్థ సీగేట్‌ టెక్నాలజీ హోల్డింగ్స్‌ సుమారు 3,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, స్ట్రైప్‌ వంటివి కూడా సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ఉద్వాసనలతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ కంపెనీల షేర్లు మాత్రం పెరుగుతున్నాయి. అక్టోబర్‌ ఆఖరులో ఉద్యోగాల కోతల వార్త ప్రకటించినప్పటి నుండి మెటా షేరు సుమారు 18 శాతం పెరిగింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement