Many Milestones Many Tragedies - 170 Years Of Indian Railways History By MP VSai Reddy - Sakshi
Sakshi News home page

170 Years Railways History: ఎన్నో మైలు రాళ్లు, అనేక విషాదాలు:170 ఏళ్ళ రైల్వే ఘన చరిత్ర ఇది!

Published Mon, Jun 5 2023 3:37 PM | Last Updated on Mon, Jun 5 2023 5:20 PM

Many milestones many tragedies170 years of railway history by VSai Reddy MP - Sakshi

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన వివరాలు ఇస్తూనే భారత రైల్వేల చరిత్రను, దాని విశిష్ఠతను ఈ ప్రపంచ వార్తాసంస్థలు అందరికీ తెలియజేస్తున్నాయి. బ్రిటిష్‌ వారి పాలనలోని భారతదేశంలో 1853లో అంటే 170 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన భారత రైల్వే వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి సాధించింది. దేశంలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చడమేగాక, ఇతర సాంప్రదాయ సరకు రవాణా పద్ధతులతో పోల్చితే రైల్వేలు అంతే సామర్ధ్యంతో, ఇంకాస్త చౌకగా వస్తు రవాణా చేయడం ద్వారా భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది.

1991 నుంచీ దేశ ఆర్థికవ్యవస్థతో పాటే రోడ్డు మార్గాలు విపరీతంగా విస్తరించినా గాని పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భారత రైల్వేలు వృద్ధిచెందాయేగాని వెనుకబడ లేదు, భారతదేశంలో నలుమూలలకూ విస్తరించిన భారత రైల్వేల రైలు పట్టాల వ్యవస్థ మ్తొత్తం విస్తీర్ణం 2022 మార్చి 31 నాటికి 1,28,305 కిలోమీటర్లు కాగా, రైళ్లు నడిచే పట్టాల (రైలు ట్రాక్‌) పొడవు 1,02,831 కి.మీ. అందులో అన్ని రైలు మార్గాల రూట్లు కలిపి చూస్తే వాటి మొత్తం పొడవు 68,043 కి.మీ. 1853లో మొదలైన భారత రైల్యేల ప్రయాణం వేగంగా ముందుకు సాగడంతో 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాల స్థాయికి చేరింది. దక్షిణాది నగరం మద్రాసులోనే కదిలిన మొదటి (గ్రానైట్‌ లోడుతో) భారత రైలు!

1953 ఏప్రిల్‌ 16న భారత రైల్వేల మొదటి రైలు బొంబాయి నుంచి ఠాణె మధ్య లాంఛనంగా పట్టాలపై నడవడంతో ప్రారంభోత్సవం జరిగిందని చెబుతారు. నాటి నగరం బొంబాయితో సమీపంలోని ఠాణె, కల్యాణ్‌ వంటి ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా కలపాలనే ఆలోచన 1843లో బొంబాయి ప్రభుత్వ చీఫ్‌ ఇంజినీర్‌ జార్జ్‌ క్లార్క్‌ బొంబాయి సమీపంలోని భాండప్‌ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిగింది. వెంటనే రైలు మార్గాల నిర్మాణ ప్రయత్నాలు మొదలబెట్టడంతో ఈ ఆలోచన పదేళ్లకు వాస్తవ రూపం దాల్చింది. 21 మైళ్ల దూరం ఉన్న ఈ రూటు మొదటి రైలులోని 14 బోగీల్లో దాదాపు 400 మంది అతిధులు బోరీ బందర్‌ లో రైలెక్కి ప్రయాణించారు. తర్వాత, తూర్పు తీరంలోని బెంగాల్‌ లో కలకత్తా నగరం సమీపంలోని హౌరా (బెంగాలీలో హావ్డా) నుంచి హుగ్లీకి మొదటి ప్రయాణికుల రైలు 1954 ఆగస్ట్‌ 15న బయల్దేరింది. ఈ రెండు కొత్త రైల్వే స్టేషన్ల మధ్య దూరం 24 మైళ్లు. భారత ఉపఖండం తూర్పు భాగానికి మొదటి రైలు మార్గాన్ని ఈస్టిండియన్‌ రైల్వే సంస్థ ఇలా ప్రారంభించింది. 

తర్వాత దక్షిణాదిలో మొదటి రైల్వే లైను ప్రారంభించారు. 1856 జులై 1న మద్రాస్‌ రైల్వే కంపెనీ మద్రాసు నగరంలోని వ్యాసరపాడి జీవ నిలయం (వెయసరపాండి), వాలాజారోడ్డు మధ్య మొదటి ప్రయాణికుల రైలు నడిపింది. ఈ రైలు మార్గం దూరం 63 కి.మీ. అయితే, దేశంలో మొదటి రైలు 1853లో నాటి బొంబాయి నగరంలో బయల్దేరిందని చెబుతారు గాని అసలు రైలు అనేది రైలు మార్గంపై నడించింది మాత్రం నాటి మద్రాసు నగర ప్రాంతంలోనే. 1837లోనే నగరంలోని రెడ్‌ హిల్స్‌ నుంచి చింతాద్రిపేట్‌ బ్రిడ్జికి మొదటి రైలును రెడ్‌ హిల్‌ రైల్వే సంస్థ నడిపింది. కానీ ఇది ప్రయాణికుల రైలు కాదు. ప్రఖ్యాత ఈస్టిండియా కంపెనీ ఇంజినీరు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ మహాశయుడు గ్రానైట్‌ రవాణా చేయడానికి ఈ రైలును తయారుచేశాడు.

గ్రానైట్‌ రవాణాతో మొదలైన గూడ్సురైళ్లే భారతరైల్వేలకు తెచ్చేది 74శాతం ఆదాయం పైన వివరించినట్టు మద్రాసు నగరంలో గ్రానైట్‌ రాయి రవాణాతో మొదలైన భారత రైల్వేల గూడ్సు రైళ్లు 1837 నుంచీ అనూహ్య రీతిలో విస్తరించాయి. ఫలితంగా ప్రస్తుతం భారత రైల్వేల ఆదాయంలో 74 శాతం సరకు రవాణా గూడ్సు రైళ్ల వ్యవస్థ ద్వారానే ప్రభుత్వానికి వస్తోంది. ఆసక్తికర అంశం ఏమంటే–చివరికి ఆటోమొబైల్‌ కంపెనీలు సైతం తమ వాహనాలను గూడ్సు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపుతున్నాయి. 2027 నాటికి ఇలాంటి రవాణాను 30శాతం పెంచాలని ఈ ఆటోమొబైల్‌ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న భారత రైల్వేలు 2019 నుంచీ మరింత వేగంగతో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేసే ‘వందే భారత్‌’ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గత ఐదేళ్లుగా పత్రికల మొదటి పేజీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది వందే భారత్‌ యుగమని ప్రజలు ఆనందిస్తున్న సమయంలో ఒడిశాలో శుక్రవారం జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. అయితే, భారత రైల్వేలు ఇలాంటి అనేక సవాళ్లను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాయి. ప్రతి దుర్ఘటన తర్వాతా ఎన్నో పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఒడిశా ప్రమాదం నుంచి కూడా ఎంతో నేర్చుకుని భారత రైల్వేలు శరవేగంతో ముందుకు పరుగెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

-విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement