పాతికేళ్ల లోపే రూ.50 లక్షలకు భారతీయుల సగటు ఆదాయం | SBI Research On The New Indian Middle Class special article by YSRCP MP vijayasai Reddy | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల లోపే రూ.50 లక్షలకు భారతీయుల సగటు ఆదాయం

Published Tue, Aug 22 2023 1:45 PM | Last Updated on Tue, Aug 22 2023 3:17 PM

SBI Research On The New Indian Middle Class special article by YSRCP MP vijayasai Reddy - Sakshi

భారతదేశంలో మధ్య ఆదాయ వర్గం ఎదుగుదలపై 77వ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా విభాగం ఎస్బీఐ రీసెర్చ్‌ విడుదల చేసిన నివేదిక ఎంతో ఆశావహంగా ఉంది. ఆర్థిక సంవత్సరాలు 2011, 2022 మధ్య పదేళ్ల కాలంలో దాఖలు చేసిన ఆదాయపన్ను రిటర్న్స్‌ ఆధారంగా దేశంలోని మధ్య తరగతి ఆదాయాలు పెరిగిన తీరును ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్‌ విశ్లేషించింది.

ఈ నివేదికలోని గణాంకాల ప్రకారం ఆర్థిక సంవత్సరాలు 2013, 2022 మధ్య కాలంలో మధ్య తరగతి భారతీయుల సగటు ఆదాయం మూడు రెట్లు పెరిగింది. అంటే వారి ఆదాయం ఈ 11 సంవత్సరాల్లో రూ.4.4 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెరిగింది. 21వ శతాబ్దం మొదటి దశాబ్దం తర్వాత భారతీయుల ఆదాయం  పెరగడం గణనీయ పరిణామం. గడచిన పది సంవత్సరాల్లో దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నత ఆదాయ వర్గం స్థాయికి ఎలా ఎదిగినదీ ‘కొత్త మధ్య తరగతి ఎదుగుదల’ అనే శీర్షికతో వచ్చిన ఎస్బీఐ రీసెర్చ్‌ నివేదిక వివరించారు. అలాగే ఇదే కాలంలో అసలు ప్రభుత్వానికి పన్నే చెల్లించాల్సిన అవసరం లేని విధంగా దాఖలు చేసే ఆదాయపన్ను రిటర్న్స్‌ సంఖ్య ఎలా పూర్తిగా మాయమైనదీ ఈ నివేదికలో పొందుపరిచారు. 

పట్టుదలతో లక్ష్య సాధనే భారతీయుల ప్రత్యేకత!
2047 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు ఇండియా పూర్తిగా అభివృద్ధిచెందిన దేశంగా అవతరిస్తుందన్న ఆకాంక్షను ప్రధానమంత్రి తన ఆగస్ట్‌ 15 ప్రసంగంలో ఢిల్లీ ఎర్రకోటపై వ్యక్తంచేశారు. మరో 24 ఏళ్లలో ‘వికసిత్‌ భారత్‌’ను చూస్తామన్న ప్రధాని కోర్కె 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులందరి మనసుల్లో ఉందంటే అతిశయోక్తి లేదు. ఆర్థిక సంవత్సరం 2047 నాటికి ఇండియాలో ఆదాయపన్ను రిటర్న్స్‌ ఫైల్‌ చేసే వారి సంఖ్య 85.3 శాతం పెరిగి 48 కోట్ల 20 లక్షలకు చేరుకుంటుందని కూడా ఎస్బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. ఈ లెక్కన భారత్‌ ఒక మోస్తరు సంపన్నదేశంగా అవతరిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2023లో రూ 2 లక్షలు ఉందని భావిస్తున్న భారత ప్రజల తలసరి ఆదాయం 2047 నాటికి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని అంచనా. అలాగే, మధ్య తరగతి భారతీయుల ప్రస్తుత సగటు ఆదాయం రూ.2 లక్షలు 24 ఏళ్ల తర్వాత 49.7 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ పరిశోధనా బృందం అంచనా వేసింది.

ఈ సంఖ్యా వివరాలు లేదా అంచనాలన్నీ భారీగా, అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి. పెరుగుతున్న భారత జనసంఖ్య, ముఖ్యంగా పనిచేసే వయసులో ఉండే యువత జనాభా ఎక్కువ ఉన్న కారణంగా పై అంచనాలను నిజం చేయడం అసలు కష్టమే కాదు. మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఎదగాలనే ఆకాంక్ష, సంపన్న దేశాల సరసన నిలబడాలనే బలమైన కోర్కె ఫలితంగా దేశాభివృద్ధితోపాటు జనం ఆదాయాలు పై స్థాయిలో పెరగడం కష్టమేమీ కాదు. 1947లోనే స్వాతంత్య్రం సంపాదించిన మన సోదర దేశం పాకిస్తాన్‌ తో పాటు, ఇతర దక్షిణాసియా, ఆసియా దేశాల పరిస్థితులతో పోల్చితే భారతదేశంలో అన్నీ సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. దేశంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సుస్థిరత, చట్ట ప్రకారం సాగే పరిపాలన వంటి అంశాలు వచ్చే పాతికేళ్లలో ఇండియాను సంపన్న దేశాల జాబితాలో చేర్చుతాయనడంలో సందేహం లేదు. అనేక ఆటుపోట్లు, అననుకూల సంకేతాలు, పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమకాలీన ప్రపంచంలో భారతదేశం ఏకైక ఆశాజనక ప్రాంతమని అంతర్జాతీయ నిపుణులు, ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

విజయసాయిరెడ్డి, వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement