
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. అయితే తొలి నుంచీ పటిష్టంగా కదిలిన మార్కెట్లు చివరి గంటన్నరంలో మరింత పురోగమించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సెన్సెక్స్ 477 పాయింట్లు జంప్‌చేసి 38,528 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగసి 11,385 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడేలో నమోదైన గరిష్టం 38,571 సమీపంలో నిలిచింది. ఈ బాటలో 11,260 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 11,402 వద్ద గరిష్టాన్నీ, 11,253 వద్ద కనిష్టాన్నీ తాకింది.
ఫార్మా వీక్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా స్వల్పంగా 0.1 శాతం నీరసించింది. ప్రధానంగా రియల్టీ 4 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగశాయి. ఇతర రంగాలలో మీడియా, మెటల్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 2.2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కొటక్ బ్యాంక్, జీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటన్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, మారుతీ, శ్రీ సిమెంట్ 6.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, గెయిల్, ఐవోసీ, బజాజ్ ఆటో 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి.
ఫైనాన్షియల్స్ ప్లస్
డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, చోళమండలం, అదానీ ఎంటర్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, మ్యాక్స్ ఫైనాన్స్, ఇండిగో, బెర్జర్ పెయింట్స్, అంబుజా, రామ్‌కో సిమెంట్ 10-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. లుపిన్, టొరంట్ పవర్, ఐడియా, కమిన్స్, పేజ్, గ్లెన్‌మార్క్, పిరమల్, అపోలో టైర్ 2.2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి.
రియల్టీ భళా
రియల్టీ కౌంటర్లలో శోభా, సన్‌టెక్, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒమాక్సీ, ఫీనిక్స్ 8.3-2.25 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.2 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,874 లాభపడగా.. 915 మాత్రమే నష్టపోయాయి.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 333 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 718 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 46 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 797 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.