దీపావళికల్లా ఇండెక్సుల సరికొత్త రికార్డ్స్‌? | Market may hit new highs about Diwali | Sakshi
Sakshi News home page

దీపావళికల్లా ఇండెక్సుల సరికొత్త రికార్డ్స్‌?

Oct 23 2020 12:59 PM | Updated on Oct 23 2020 12:59 PM

Market may hit new highs about Diwali - Sakshi

ఎన్నో ఆటుపోట్లను చవిచూస్తున్న ఈ క్యాలండర్‌ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను మరోసారి నెలకొల్పే వీలున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలుత జనవరిలో అటు సెన్సెక్స్‌ 42,273 వద్ద, ఇటు నిఫ్టీ 12,430 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఆపై ప్రపంచ దేశాలన్నిటినీ కోవిడ్‌-19 చుట్టేయడంతో మార్చిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు 52 వారాల కనిష్టాలకు చేరాయి. ఆపై తిరిగి రికవరీ బాట పట్టి 50 శాతం ర్యాలీ చేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లపై స్టాక్‌ నిపుణులు ఏమంటున్నారంటే.. 

రికార్డ్‌ గరిష్టాలవైపు..
కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల సమీపానికి చేరగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిలో కదులుతోంది. ఇందుకు ప్రధానంగా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు, వివిధ దేశాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీల కారణంగా పెరిగిన లిక్విడిటీ దోహదపడుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు సుమారు 4 శాతం చేరువలో కదులుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో దీపావళికల్లా మార్కెట్లు సరికొత్త రికార్డులకు చేరే వీలున్నట్లు విశ్లేషిస్తున్నారు. బొనాంజా పోర్ట్‌ఫోలియో రీసెర్చ్‌ హెడ్‌ విశాల్‌ వాగ్‌, మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ పల్కా చోప్రా తదితర నిపుణుల అభిప్రాయాలు చూద్దాం..

దివాలీకల్లా
గత ఐదేళ్లలో దీపావళికి ముందు 30 రోజులు, తదుపరి 4 వారాల్లో మార్కెట్లు సగటున 0.2-0.6 శాతం స్థాయిలో ర్యాలీ చేశాయి. దీంతో ఈ దీపావళి సమయంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త రికార్డుల దివ్వెలు వెలిగే వీలుంది. 2015లో దివాలీకి ముందు సెన్సెక్స్‌ 1.3 శాతం పుంజుకోగా.. తదుపరి నెల రోజుల్లో 3.38 శాతం ఎగసింది. 2016లో తొలుత 0.23 శాతం బలపడగా.. ఆపై 1.85 శాతం లాభపడింది. 2017లో అయితే ముందు 6.4 శాతం జంప్‌చేయగా.. తదుపరి 1.7 శాతం పుంజుకుంది. 2018లో అయితే 2.5 శాతం, 1.24 శాతం చొప్పున లాభపడింది. ఇక 2019లో తొలుత 1.1 శాతం బలపడగా.. దీపావళి తరువాత నెల రోజుల్లో 4.5 శాతం జంప్‌చేసింది. ప్రస్తుత ట్రెండ్‌ కొనసాగితే.. ఈసారి(2020లో) మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించే అవకాశముంది. 

ఎఫ్‌పీఐల దన్ను
ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ భారీగా మెరుగుపడగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మార్చి నుంచి చూస్తే నికరంగా దేశీ ఈక్విటీలలో రూ. 30,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్‌(డీఐఐలు) నికర అమ్మకందారులుగా నిలవడం గమనార్హం! ఈ అంశాలు మార్కెట్ల జోరుకు సహకరిస్తున్నప్పటికీ కరోనా వైరస్‌ సోకుతున్న కేసులు పెరగడం, తిరిగి లాక్‌డవున్‌లు విధంచే పరిస్థితులు తలెత్తడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చు. ఇది ఆర్థిక రికవరీని ఆలస్యం చేసే వీలుంది. ఫలితంగా కంపెనీల పనితీరు మందగించవచ్చు.

పండుగల పుష్
ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు, ఆర్‌బీఐ లిక్విడిటీ చర్యలు, కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ తయారీపై ఆశలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. ఇటీవల అన్‌లాక్‌తో ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు పండుగల సీజన్‌ ప్రారంభంకావడంతో వాహనాలు, హోమ్‌ అప్లయెన్సెస్‌, టెక్స్‌టైల్స్‌, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాలలో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే సెప్టెంబర్‌ ‍క్వార్టర్‌(క్యూ2)లో కంపెనీలు ఆశావహ ఫలితాలు సాధించాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు రెండు నెలల కాలంలో మరింత జోరు చూపవచ్చు.

12,050కు పైన
సాంకేతికంగా చూస్తే రానున్న కాలంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,050 పాయింట్లకు ఎగువన నిలవగలిగితే మరింత పుంజుకునే వీలుంది. అలాకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, కోవిడ్‌-19 ప్రభావం వంటి అంశాలతో సెంటిమెంటు బలహీనపడితే నిఫ్టీ డీలాపడే వీలుంది. చార్టుల ప్రకారం 11,650 దిగువకు నిఫ్టీ చేరితే.. 11,200 వరకూ బలహీనపడవచ్చు. ఏదేమైనా దీపావళి లేదా.. తదుపరి కాలంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నప్పటికీ ఆ స్థాయిలో కొనసాగుతాయా లేదా అన్నది వేచిచూడవలసిన విషయమే?! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement