Mayuri Kango ఐఐటీ చదివి మంచి జాబ్ కొట్టడం ఒక బెంచ్‌మార్క్. లేదా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, గ్లామర్ ప్రపంచంలో నటిగా వెలిగిపోవాలని కలలు కనడం మరో రకం. ఈ రెండింటి మధ్య మయూరి కాంగో స్టయిలే వేరు. టెక్ దిగ్గజం నేతృత్వంలోని సుందర్ పిచాయ్ కంపెనీ ఉద్యోగిగా ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది. మయూరి కాంగో షాకింగ్ జర్నీ ఏంటో ఒకసారి చూద్దాం.
ఐఐటీ కాన్పూర్‌కి ఎంపికైన మయూరి, బాలీవుడ్‌లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. యాక్టర్ అవ్వాలన్న చిన్ననాటి కల తీరినందుకు సంతోషంలో మునిగి తేలింది. కానీ అంతలోనే సర్‌ప్రైజింగ్‌గా బాలీవుడ్‌ని వదిలి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. నటిగా గ్లామర్ ప్రపంచానికి దూరమై కార్పొరేట్ వరల్డ్‌లో సెటిల్ అయింది.
మయూరి ఇంటర్ చదువుతుండగా సయీద్ అక్తర్ మీర్జా దర్శకత్వంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఆధారంగా రూపొందించిన 1995 బాలీవుడ్ చిత్రం నసీమ్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది.మొదట వద్దనుకున్నా తరువాత యాక్టర్‌గా ఒప్పుకుంది. ఆ తరువాత దర్శక-నిర్మాత మహేష్ భట్ కంటపడిన మయూరి 1996 చిత్రం పాపా కెహతే హై మూవీలోని హిట్ పాట "ఘర్ సే నికల్తే హై"తో పాపులర్ అయింది. తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ , అర్షద్ వార్సీలతో కలిసి పనిచేసింది.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ సరసన 2000లో వంశీ మూవీలో కూడా మెరిసింది. వీటితోపాటు బాదల్ (2000), హోగీ ప్యార్ కి జీత్ (1999), బేతాబి (1997) వంటి చిత్రాలలో కనిపించింది. డాలర్ బహు (2001), కరిష్మా: ది మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ (2003) సీరియల్‌లలో కరిష్మా కపూర్ కుమార్తెగా నటించి మెప్పించింది. ఇంకా నర్గీస్, తోడ ఘం తోడి ఖుషీ, డాలర్ బాబు అండ్ కిట్టి పార్టీ వంటి టెలివిజన్ షోలను కూడా చేసింది. అయితే ఇవి కూడా పెద్దగా విజయం సాధించలేదు.
16 సినిమాల్లో నటించినా, చాలా వరకు విడుదల కాలేదు. విడుదలైనా థియేటర్లలో కాసులు కురిపించక పోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2003లో ఎన్‌ఆర్‌ఐ ఆదిత్య ధిల్లాన్‌ను పెళ్లాడి అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడే ఆమె జీవితం మరోటర్న్ తీసుకుంది. బరూచ్ కాలేజీలోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్‌లో MBAలో చేరింది. తరువాత, 2004-2012 మధ్య, అమెరికాలో పని చేసింది. 2013లో తిరిగి ఇండియాకు వచ్చి పెర్ఫార్మిక్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేయడం ప్రారంభించింది. ఇక ఆ తరువాత 2019లో గూగుల్ ఇండియాలో చేరి, ఇండస్ట్రీ హెడ్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్ ఆఫ్ ఏజెన్సీ పార్టనర్‌షిప్‌గా పని చేస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment