
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నట్లు సీఈఓ భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. ఎలక్ట్రిక్ బైక్, చౌకైన ఈ-స్కూటర్లపై కంపెనీ దృష్టి సారించినట్లు ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన ఒక ఆర్టికల్‌ను రీట్వీట్ చేస్తూ ‘అవును, వచ్చే సంవత్సరం’ అని పేర్కొన్నారు. గతంలో ఆయన తన బ్లాగ్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ కంపెనీ ఉత్పత్తులను ఈ-మోటార్ సైకిళ్ల నుంచి ఈ-కార్ల వరకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, కార్లను అభివృద్ధి చేసే ప్రణాళికలను వేగవంతం చేయడానికి 200 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.1500 కోట్ల)ను ఓలా ఎలక్ట్రిక్ సేకరించింది. ‘మిషన్ ఎలక్ట్రిక్’ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిధులను సమీకరించినట్లు భవేష్ పేర్కొన్నారు. 2025 నాటికి దేశ రోడ్లపై పెట్రోల్ తో నడిచే ద్విచక్ర వాహనం ఉండదని కంపెనీ అంచనా వేస్తుంది. ఈవీ స్టార్టప్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1, ఎస్1 ప్రోను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించింది. ఈ మోడల్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టనుంది. డిసెంబర్‌లో రెండో విడత విక్రయాలను చేపట్టనుంది.
Yes next year👍🏼 https://t.co/dLT1n5qdRp
— Bhavish Aggarwal (@bhash) November 13, 2021
(చదవండి: టెస్లాను వెంటాడుతున్న కష్టాలు)