
గోవా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) పెంపును ప్రకటించింది. పెట్రోల్ ధర రూ.1, డీజిల్ ధరను 60 పైసలు పెంచుతూ.. స్టేట్ గవర్నమెంట్ అండర్ సెక్రటరీ (ఆర్థిక) ప్రణబ్ జి భట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ధరల పెరుగుదల ఈ రోజు (జూన్ 22) నుంచే అమలులోకి వస్తాని పేర్కొన్నారు.
ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ గత వారంలో కీలక ప్రకటన వెల్లడించింది.
ధరల పెరుగుదల సమంజసం కాదని, ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యూరి అలెమావో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద పెను భారం మోపాలని ఇలాంటి ప్రకటనలు చేస్తుందని అన్నారు. ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచారు, ఇప్పుడు ఇంధన ధరలు పెంచారని అలెమావో పేర్కొన్నారు.
విద్యుత్ చార్జీలను పెంచిన తరువాత, అవినీతికి ఆజ్యం పోయడానికి ఇప్పుడు ఇంధన ధరలను పెంచిందని, సామాన్యులను ఇంకెంత బాధపెడతారు అంటూ.. గోవా ఆమ్ ఆద్మీ ప్యారీ చీఫ్ అమిత్ పాలేకర్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.