50 వేల ఉద్యోగాలు కల్పించనున్న పల్సస్ గ్రూప్
పల్సస్ గ్రూప్ సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఏఐ ఆధారిత ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దానివల్ల సుమారు 50,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ డాక్టర్ గెడెల శ్రీనుబాబు తెలిపారు.
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాజెక్ట్ హెల్త్‌కేర్‌తో పాటు ఐటీ రంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల స్థానిక యువతకు 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, దాదాపు 40,000 పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక కృత్రిమేమేధ సహాయంతో ఔషధాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుంది. దానివల్ల రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, మందులను అందించవచ్చు. ఇది దేశంలోనే హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో తెలంగాణను ముందంజలో ఉంచుతుంది’ అని శ్రీనుబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘ఫార్మా పరిశ్రమలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించడం వల్ల తక్కువ ధరకే రోగులకు మందులు, చికిత్స అందే వీలుంటుంది. గ్లోబల్ ఫార్మా క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9-10 ఫార్మా జోన్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సీఏం రేవంత్ రెడ్డి నిర్ణయించారు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హాట్‌స్టార్‌లో అనంత్-రాధికల వివాహ వేడుక
దేశంలో బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా హైదరాబాద్ కంపెనీలదే కావడం విశేషం. అందుకనే హైదరాబాద్‌ను ‘బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అంటారు. ప్రపంచంలోని చాలా వ్యాక్సిన్లు స్థానిక కంపెనీలు తయారుచేసినవే. ఫార్మా రంగంలో హైదరాబాద్‌ను ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’ అని కూడా పిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment