ముంబై: డిజిటల్ రుణాల జారీకి సంబంధించి ఆర్‌బీఐ తీసుకొచ్చిన నూతన నిబంధనలను పరిశ్రమ స్వాగతించింది. మరింత బాధ్యతాయుతంగా పరిశ్రమ వృద్ధి చెందడానికి సాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టళ్లు తదితర డిజిటల్ చానళ్ల ద్వారా జారీ చేసే రుణాలకు మధ్యవర్తుల సాయం తీసుకున్నా కానీ.. ఆయా రుణాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు నేరుగా రుణగ్రహీతల ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్‌బీఐ బుధవారం నూతన నిబంధనలను ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.
ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయరాదని, అనైతిక రుణ వసూళ్ల విధానాలను అనుసరించకూడదని ఆదేశించింది. దీనిపై డిజిటల్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డీఎల్‌ఏఐ) స్పందించింది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోణంలో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఫైనాన్షియల్, ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ల మధ్య సహకారాన్ని తప్పనిసరి చేయడాన్ని సానుకూలంగా పేర్కొంది. కస్టమర్లకు, ఫిన్‌టెక్ సంస్థలకు కొత్త నిబంధనలు ఎంతో సానుకూలమని డీఎల్‌ఏఐ ప్రెసిడెంట్ లిచీ చప్‌మన్ (జెస్ట్‌మనీ) పేర్కొన్నారు. లోపాల ఆసరాగా వ్యాపారాల నిర్మాణానికి అనుమతించేది లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసిందన్నారు. ఆర్‌బీఐ నూతన నిబంధనలు ఇప్పటికే సేవలు అందిస్తున్న సంస్థలకు కొంత ప్రతిబంధకమని కోటక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. పారదర్శకత, గోప్యతపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment