న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపును సమీక్షించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరుతోంది. చమురు అన్వేషణ, గుర్తింపు, ఉత్పత్తికి సంబంధించిన కాంట్రాక్టుల్లో ఆర్థిక స్థిరత్వ సూత్రానికి రెండున్నర నెలల క్రితం ప్రవేశపెట్టిన ఈ పన్ను విధింపు విరుద్ధమని ఆర్థికశాఖకు ఆగస్టు 12న రాసిన ఒక లేఖలో చమురు మంత్రిత్వశాఖ అభిప్రాయపడిన విషయం తాజాగా వెల్లడైంది. చమురు మంత్రిత్వశాఖ లేఖ ప్రకారం..
► ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ (పీఎస్‌సీ), రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ (ఆర్‌ఎస్‌సీ) కింద వేలంలో కంపెనీలకు లభించిన ఫీల్డ్‌లు లేదా బ్లాక్‌లకు కొత్త లెవీ నుండి మినహాయింపు ఇవ్వాలి.
► 1990ల నుండి కంపెనీలకు వివిధ కాంట్రాక్టు విధానాలలో చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి కోసం బ్లాక్‌లు లేదా ప్రాంతాలను కేటాయించడం జరుగుతోంది. ఇందుకు సంబంధించి రాయల్టీ అలాగే సెస్ విధింపు జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన లాభాల శాతాన్ని కూడా పొందుతోంది.
► ఆయా కాంట్రాక్టుల విషయంలో లాభాలు పెరుగుతుంటే, ప్రభుత్వానికి కూడా అధిక లాభాల వాటా బదిలీ అయ్యే విధంగా అంతర్నిర్మిత యంత్రాంగ ప్రక్రియ అమలవుతోంది.
► ఇలాంటి పరిస్థితిలో దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురకు సంబంధించి కంపెనీలు అన్నింటినీ ఒకేగాటన కడుతూ, తిరిగి విండ్‌ఫాల్ ట్యాక్స్ విధింపు ఎంతమాత్రం సరికాదు
లభించని శాఖల స్పందన..
కాగా, ఈ లేఖపై స్పందించాల్సిందిగా అటు చమురు మంత్రిత్వశాఖకు ఇటు ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపిన ఈమెయిల్స్‌కు ఎటువంటి స్పందనా రాలేదు.
విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ అంటే..
జూలై 1 నుంచి దేశంలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు అమల్లోకి వచ్చింది. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, ఏటీఎఫ్‌సహా ఇంధనాల ఎగుమతులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రెండు వారాలకో సారి (15 రోజులకు) ప్రభుత్వం సమీక్షిస్తూ, తగిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. విదేశీ మారకం రేట్లు, అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి పక్షం రోజులకు ఒకసారి దీనిపై నిర్ణయం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment