న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం కార్యకలాపాలు ఆగస్టులో ఊపందుకున్నాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 57.7 వద్ద ఉంటే, ఆగస్టులో 58.6కు ఎగసింది. దాదాపు మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయిలో కొత్త ఆర్డర్‌లు, ఉత్పత్తి త్వరితగతిన పెరగడం దీనికి కారణమని శుక్రవారం విడుదలైన సర్వే పేర్కొంది. కాగా, సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు.
ఈ ప్రాతిపదికన తయారీ రంగం వరుసగా 26 నెలల నుంచి వృద్ధి బాటన కొనసాగుతోంది. కొత్త ఆర్డర్లు తయారీ రంగానికి ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం వాటా దాదాపు 70 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్యానల్‌లోని దాదాపు 400 తయారీ రంగ సంస్థల పర్చేజింగ్ మేనేజర్స్‌కు పంపిన ప్రశ్నలు, అందిన సమాధానాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి. 2005 మార్చిలో ఈ గణాంకాల సేకరణ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment