
న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్) షేర్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై పలువురు వ్యక్తులుసహా, 10 సంస్థలపై విధించిన ఆంక్షలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రస్తుతానికి ఎత్తివేసింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టులో తమ అప్పీల్‌కు లోబడి తన తాజా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.
ఉత్తర్వులు ఇవీ...
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధరపై ప్రభావం చూపగల బయటకు వెల్లడికాని సమాచారాన్ని పొందడం ద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిర్వహించిన ఆరోపణలపై కొందరు వ్యక్తులుసహా 15 సంస్థలపై ఆంక్షలు విధిస్తూ 2021 ఆగస్టు 20వ తేదీన సెబీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జూన్30తో ముగిసే త్రైమాసిక ఆడిటెడ్ ఫలితాల అంతర్గత సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టడం ద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించారన్నది ఇందులో ప్రధాన ఆరోపణ. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ సెక్యూరిటీల మార్కెట్లలో లావాదేవీలు చేపట్టరాదన్న ఆంక్షలుసహా, ఈ కేసులో అక్రమంగా లబ్ది పొందారని భావిస్తున్న రూ.23.84 కోట్లను తిరిగి జప్తు చేయాలన్నది సెబీ ఆదేశాల్లో ప్రధాన అంశాలు.
శాట్ రూలింగ్‌పై సెబీ అప్పీల్
సెబీ తప్పు పట్టిన వారిలో బిజల్ షా, గోపాల్ రిటోలియా, జతిన్ చావ్లా, అమిత్ భన్వర్‌లాల్ జాజూ, మనీష్ కుమార్ జాజూ, గోమతీ దేవి రిటోలియా, దల్జిత్ గురుచరణ్ చావ్లా, మోనికా లఖోటియా, పుష్పాదేవి జాజూ, భవర్‌లాల్ రాంనివాస్ జాజూ, భవర్‌లాల్ జాజూ, భవర్‌లాల్ జాజోరే విజయ భాగస్వాములు, యష్ అనిల్ జాజూ విమల సోమానిలు ఉన్నారు. వీరిలో మొదటి వ్యక్తి బిజల్ షా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్, విశ్లేషణ, వ్యూహరచన, ఇన్వెస్టర్ రిలేషన్స్ విభాగం చీఫ్‌గా ఉన్నారు. కాగా, ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ, ఐదుగురు వ్యక్తిగతంగా సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు. సెబీ మధ్యంతర ఉత్తర్వులను శాట్ గత ఏడాది నవంబర్‌లో తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను ఉదహరిస్తూ, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని ఈ కేసులోని మరో 10 సంస్థలు సెబీని ఆశ్రయించాయి. వీరి విజ్ఞప్తిని స్వీకరించిన సెబీ, ఇందుకు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. అయితే శాట్ ఉత్తర్వులపై తాను ఇప్పటికే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయని, ఆంక్షలు ఎత్తివేస్తూ తన తాజా ఉత్తర్వులు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. ఈ కేసులో సంస్థలు ఇప్పటికే డిపాజిట్ చేసిన మొత్తం వడ్డీతోసహా తదుపరి ఆదేశాలను వెలువరించేవరకూ ఎస్క్రో అకౌంట్‌లో కొనసాగుతాయని కూడా సెబీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment